మున్సిపల్ కాంట్రాక్టు వర్కర్ల జీతాలపై మెలిక.. పెంచిన వేతనాలపై ఆడిట్ శాఖ అభ్యంతరం

మున్సిపల్ కాంట్రాక్టు వర్కర్ల జీతాలపై మెలిక.. పెంచిన వేతనాలపై ఆడిట్ శాఖ అభ్యంతరం
  • మంచిర్యాల జిల్లాలో రూ.73.23 లక్షల రికవరీకి సిఫార్సు
  • జీవోల ప్రకారమే పెంచారంటున్న కార్మిక సంఘాలు
  • సీడీఎంఏకు చేరిన పంచాయితీ

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల కార్పొరేషన్తో పాటు జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ వర్కర్ల జీతాలపై అయోమయం నెలకొన్నది. గత కొంతకాలంగా వర్కర్లకు పెంచిన వేతనాలపై ఆడిట్ ​డిపార్ట్​మెంట్​అభ్యంతరాలు తెలిపింది. పెంచిన జీతాలు​తగ్గించడమే కాకుండా ఇప్పటివరకు అదనంగా చెల్లించిన రూ.73.23 లక్షలను రికవరీ చేయాలని మున్సిపల్ ​డిపార్ట్​మెంట్​కు సిఫార్సు చేసింది.

ఈ సిఫార్సులపై మున్సిపల్​ కాంట్రాక్టు వర్కర్ల సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ జీవోల ప్రకారమే మున్సిపాలిటీల్లో జీతాలు పెంచారని, వాటిని తగ్గించి వర్కర్ల కడుపు కొట్టాలని చూస్తే ఆందోళనకు దిగుతామని నాయకులు హెచ్చరిస్తున్నారు. చివరకు జీతాల పంచాయితీ సీడీఎంఏకు చేరినట్టు తెలిసింది. దీనిపై ఆ శాఖ ఉన్నతాధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారనే టెన్షన్​ నెలకొన్నది.

జీతాల పెంపు ఇలా..
జిల్లాలో మంచిర్యాల మున్సిపల్​ కార్పొరేషన్​తో పాటు బెల్లంపల్లి, మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలోని వివిధ విభాగాల్లో 2వేల మందికి పైగా కాంట్రాక్ట్​ వర్కర్లు పనిచేస్తున్నారు. పబ్లిక్​ హెల్త్​వర్కర్లు, డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ ​సబార్డినేట్స్​గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నాలుగు కేటగిరీల్లో జీతాలు చెల్లిస్తున్నారు. జీవో ఎంఎస్​నంబర్​60, 63 (2021 జూన్​ 11, 15) ద్వారా అప్పటి ప్రభుత్వం 30 శాతం వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 

అప్పటివరకు కేటగిరీ1 వేతనం రూ.12 వేలు కాగా, రూ.15,600కు, కేటగిరీ2కు రూ.15 వేల నుంచి రూ.19,500, కేటగిరీ3కి రూ.17,500 నుంచి రూ.22,750కు పెరిగాయి. 2023 మే 1న జారీ చేసిన జీవో ఎంఎస్​ నంబర్​40 ద్వారా నెలకు రూ.వెయ్యి అదనంగా మంజూరు చేసింది.

దీంతో కేటగిరీల వారీగా రూ.16,600, రూ.20,750, రూ.23,750కు వేతనాలు పెరిగాయి. తర్వాత 2024 ఫిబ్రవరి 2న సీడీఎంఏ జారీ చేసిన మెమో నంబర్​6603 ద్వారా మరో రూ.వెయ్యి పెంచడంతో కేటగిరీ1కు రూ.17,600, కేటగిరీ2కు రూ.21,500, కేటగిరీ3కు రూ.24,750 చొప్పున చెల్లిస్తున్నారు.

ఆడిట్ ​శాఖ అభ్యంతరం
మున్సిపల్ కాంట్రాక్టు వర్కర్లకు పలు దఫాలుగా పెంచిన వేతనాలపై ఆడిట్​ డిపార్ట్​మెంట్​అభ్యంతరాలు లేవనెత్తింది. జీవో 69లో నిర్ణయించిన వేతనాలు కొత్తగా నియమించే వారికి మాత్రమే వర్తిస్తాయిని పేర్కొన్నది. పెంచిన వేతనాలు నిలిపివేయడంతో పాటు పాత జీతాలు చెల్లించాలని మున్సిపల్​ శాఖ వరంగల్​ రీజినల్ ​డైరెక్టర్​కు నెల క్రితం సిఫార్సు చేసింది. ఇప్పటివరకు అదనంగా చెల్లించిన రూ.73.23 లక్షలను కార్మికుల నుంచి రికవరీ చేయాలని పేర్కొనడంతో ఆడిట్​ డిపార్ట్​మెంట్​ సిఫార్సులపై కాంట్రాక్టు వర్కర్ల సంఘాలు మండిపడుతున్నాయి.

ఆయా విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బడుగు బలహీన వర్గాలవారే పనిచేస్తున్నారని.. జీతాలు తగ్గించి వారి పొట్టగొడితే ఊరుకునేది లేదని నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్​ కాంట్రాక్టర్ ​వర్కర్​ యూనియన్​జిల్లా గౌరవాధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​బక్కి వెంకటయ్య దృష్టికి తీసుకెళ్లారు.

మున్సిపాలిటీల్లో చాలీచాలని వేతనాలకు పనిచేస్తున్న వర్కర్లకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. ఆడిట్​శాఖ అభ్యంతరాలపై సీడీఎంఏ ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.