నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తరు?

నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తరు?

రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారని, వారికి భృతి ఇస్తామన్న ప్రభుత్వం ఆ మాటే ఎత్తడం లేదేమని పీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి నిలదీశారు. రాష్ట్రంలో టీఆర్​ఎస్​ సర్కారు నిరంకుశ పాలన సాగిస్తోందని, రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మారుస్తోందని మండిపడ్డారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్​ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం గాంధీభవన్​లో ఉత్తమ్​ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడారు. పార్లమెంట్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చేసిన పోరాటంతోనే సోనియా గాంధీ స్పందించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్ సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత 60 ఏళ్లలో తెలంగాణకు 69 వేల కోట్లు అప్పు ఉంటే.. తెలంగాణ ఏర్పాటైన ఐదేళ్లలోనే అప్పులు 2 లక్షల 60 వేల కోట్లకు పెరిగాయని, ఈ సొమ్ముకు తగినట్టుగా అభివృద్ధి కూడా జరగలేదని చెప్పారు.

ప్రజలకు అండగా ఉంటాం…

రాష్ట్ర పబ్లిక్​ సర్వీస్​కమిషన్​లో నమోదు చేసుకున్న నిరుద్యోగులే 12 లక్షల మందికిపైగా ఉన్నారని ఉత్తమ్​ చెప్పారు. కానీ కేసీఆర్ సర్కారు ఇంకా నిరుద్యోగ భృతి విధి విధానాలు కూడా రూపొందించలేదన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. అలాంటి విషయాలను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. రాష్ట్ర ప్రజలకు తాము అండగా ఉంటామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్​సభ ఎలక్షన్లలో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ ను ఓడించేది కాంగ్రెస్ మాత్రమేనని, ఇక్కడ బీజేపీకి ఎంపీ సీట్లు అదృష్టం కొద్దీ వచ్చినవేనని పేర్కొన్నారు. విభజన హామీల అమల్లో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. గిరిజన యూనివర్శిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీ ఏమయ్యాయని ప్రశ్నించారు. గాంధీభవన్​ వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, కోదండరెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.