బీఆర్కే కు జ్వరమొచ్చింది

బీఆర్కే కు జ్వరమొచ్చింది
  • జ్వరం, జలుబు, గొంతు ఇన్​ఫెక్షన్లతో ఇబ్బందులు
  • మరమ్మతు పనుల దుమ్ము, ధూళితో అవస్థలు
  • అసెంబ్లీ జరుగుతుండడంతో సెలవులివ్వని అధికారులు 

ఓ వైపు రిపేర్లు.. దాని నుంచి వచ్చే దుమ్ము  ధూళి. ఇరుకిరుకు గదులు.. ఎక్కడపడితే అక్కడే వ్యర్థాలు. ఇంకో వైపు హుస్సేన్​సాగర్​, నాలా.. ముక్కుపుటాలదిరే కంపు. వెరసి, బీఆర్​కే భవన్​ ఉద్యోగులను అనారోగ్య సమస్యలు పట్టుకున్నాయి. 40 శాతం మంది జ్వరాలు, శ్వాస సంబంధ సమస్యలు, గొంతు ఇన్​ఫెక్షన్లతో బాధపడుతున్నారు. అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో సెలవులు కూడా లేకపోవడంతో అనారోగ్యంతోనే పనిచేస్తున్నారు. రిపేర్లకు ఇంకా 15 రోజుల టైం పట్టే అవకాశాలుండడంతో ఉద్యోగులు ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. పాత సెక్రటేరియట్​లో రెగ్యులర్​, ఔట్​సోర్సింగ్​, కాంట్రాక్టు ఉద్యోగులు కలిపి 2 వేల మంది దాకా పనిచేసేవారు. షిఫ్టింగ్​ టైంలో కొన్ని శాఖలను వేరే చోటుకు తరలించడంతో, ప్రస్తుతం బీఆర్​కే భవన్​లో 1500 మంది దాకా డ్యూటీ చేస్తున్నారు.

కనీస అవసరాలూ కరువే

నిజానికి బీఆర్​కే భవన్​లో పనిచేయడంపై ఉద్యోగులు ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అధికారులు, ఉన్నతాధికారులూ వద్దంటూనే ఉన్నారు. బిల్డింగ్​లో వెంటిలేషన్​ లేకపోవడం, ఇరుగ్గా ఉండడం, హుస్సేన్​సాగర్​, నాలాలు పక్కనే ఉండి చెడు వాసనలు రావడం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్​పై వాహనాల శబ్దం ఎక్కువగా ఉండడం, పార్కింగ్​ లేకపోవడం వంటి కారణాలతో బీఆర్​కే భవన్​లో డ్యూటీ చేసేందుకు వాళ్లు ఇష్టపడలేదు. కానీ, వేరే ప్రత్యామ్నాయం లేకపోవడం, అక్కడే పనిచేయాలని ప్రభుత్వం, సీఎస్​ ఆదేశించడంతో వెళ్లక తప్పలేదంటున్నారు ఉద్యోగులు. అక్కడికి వెళ్లాక కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయలేదని వాపోతున్నారు. ఒక్కటే లిఫ్ట్​తో క్యూలో నిలబడి వెళ్లాల్సి వస్తోందంటున్నారు. క్యాంటీన్​ కూడా సరిగ్గా లేదని, చీకట్లోనే తినాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. అంతేగాకుండా రిపేర్లు చేసిన సామగ్రిని వివిధ ఫ్లోర్ల కారిడార్లలోనే వేస్తున్నారని, దాని వల్ల మరింత ఇరుకుగా ఉంటోందని వాపోతున్నారు. ఏడాదిలో కొత్త సెక్రటేరియట్​ పూర్తవుతుందని సర్కారు చెబుతున్నా, మరో ఏడాదిన్నర, రెండేళ్లదాకా పట్టే అవకాశం ఉందని, అప్పటిదాకా బీఆర్​కేలో ఎలా పనిచేయాలని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిపేర్లు చేస్తున్న వ్యర్థాలను జీహెచ్​ఎంసీ తీసుకెళ్లకపోవడంతో అవన్నీ బీఆర్​కే ఆవరణలోనే గుట్టలుగా పేరుకుపోతున్నాయి. గత నెల 8న ప్రారంభమైన షిఫ్టింగ్​ నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటికి 70 శాతం పూర్తయిందని, మిగతా షిఫ్టింగ్​ త్వరలోనే పూర్తవుతుందని అసెంబ్లీలో ఆర్​ అండ్​ బీ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి ప్రకటించారు.