ఈసారి కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం : అమిత్ షా

ఈసారి కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం : అమిత్ షా

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ భయపడుతున్నదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అందుకే  నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. కర్నాటకలోని బసవ కళ్యాణ్ తాలుకా గోరట గ్రామంలో రజాకార్ల దాష్టీకంపై పోరాడి అసువులు బాసిన అమరవీరుల స్మారకార్థం ఏర్పాటు చేసిన స్థూపాన్ని, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆదివారం అమిత్ షా ఆవిష్కరించారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ  వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన పబ్లిక్ మీటింగ్ లో అమిత్ షా మాట్లాడారు. గోరట గ్రామంలో 1948 మే 9న రజాకార్లతో పోరాడిన యోధుల గురించి ప్రస్తావించారు. నాడు యావత్ దేశం స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంటే హైదరాబాద్ రాష్ట్రం క్రూర నిజాం చేతిలో బందీగా ఉండేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గతేడాది అద్భుతంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించామని అమిత్ షా చెప్పారు.

ఈ ఏడాది కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమానికి తెలంగాణ నుంచి కార్యకర్తలు తరలివెళ్లారు. గోరట గ్రామంలోని లక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని  సంజయ్  దర్శించుకున్నారు. ఆనాడు రజాకార్లతో పోరాటం సందర్భంగా గ్రామస్తులకు ఆశ్రయం ఇచ్చి, వందలాది మందిని కాపాడిన చారిత్రాత్మక ఇంటిని కూడా ఆయన సందర్శించారు.