ఫిబ్రవరి 24న రాష్ట్రానికి అమిత్షా

ఫిబ్రవరి 24న రాష్ట్రానికి అమిత్షా
  • విజయ సంకల్ప యాత్రలో పాల్గొననున్న కేంద్ర మంత్రి
  • అదే రోజు బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తారని టాక్​

హైదరాబాద్, వెలుగు: బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 24న రాష్ట్రానికి వస్తున్నట్టు సమాచారం. యాత్రలో ఆయన ఎక్కడ పాల్గొంటారన్నదానిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ యాత్రలోనే బీజేపీ లోక్​సభ అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉన్నట్టు తెలిసింది.

అయితే, దానికంటే ముందు ఢిల్లీలో పార్టీ ఎలక్షన్ మేనేజ్​మెంట్ కమిటీ సమావేశమై అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అమిత్ షా పర్యటనకు కొద్ది రోజులే టైమ్ ఉండటంతో ఇంత తక్కువ సమయంలో మీటింగ్ జరిగే అవకాశాల మీదనే అభ్యర్థుల ప్రకటన ఆధారపడి ఉంటుందని కొందరు లీడర్లు అంటున్నారు. 

గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా..

లోక్​సభ ఎన్నికలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన దానికంటే ఎక్కువ ఓట్లు రాబట్టుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతి ఎలక్షన్ బూత్ నుంచి కనీసం 20 మందిని పార్టీలో చేర్చుకునేలా కసరత్తు చేస్తున్నారు. దీంతో గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.

అన్ని పార్టీల కంటే ముందే.. బీజేపీ లోక్​సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ఎలక్షన్లు అయ్యేదాకా లీడర్లందరినీ ఎంగేజ్ చేసేలా అధిష్ఠానం కార్యక్రమాలను రూపొందిస్తున్నదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలు ప్రజలకు తెలియజేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. యాత్ర సందర్భంగా భారీ సభలు నిర్వహించకుండా.. ప్రతి రోజూ సాయంత్రం ప్రజల మధ్యే కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నది.

రైతులు, మహిళలు, నిరుద్యోగులే టార్గెట్

రైతులు, మహిళలు, నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేలా బీజేపీ ప్రచార వ్యూహాలు రచిస్తున్నది. కార్నర్ మీటింగుల్లో వాళ్లే ఎక్కువగా ఉండేలా పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందో తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు పీఎం కిసాన్, యూరియా సబ్సిడీ వంటి వాటి గురించి వివరిస్తున్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాలను చెప్తున్నారు. మహిళల అభ్యున్నతి కోసం చేపడ్తున్న కార్యక్రమాలను వివరిస్తున్నారు.