
- డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణ చర్యలపై కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ ప్రశంసలు
- ఐసీసీసీలో కేంద్ర హోంశాఖ బృందం సమీక్ష సమావేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ సంతృప్తి వ్యక్తం చేశారు. డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి చేస్తున్న కృషిని అభినందించారు. వీటితో పాటు కొత్త క్రిమినల్ చట్టాల అమలు, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, అత్యుత్తమ ట్రైనింగ్, భద్రతాపరమైన సవాళ్లను అధిగమిస్తున్న తీరును ప్రశంసించారు.
కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు సంబంధించి పర్యవేక్షణలో భాగంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎస్‌సీఆర్‌బీ), బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(బీపీఆర్ అండ్ డీ), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ)లకు చెందిన జాయింట్ సెక్రటరీలతో కలిసి ఆయన సౌత్ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణ రావు, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్, శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సహా సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ, కొత్త చట్టాల అమలుకు సంబంధించిన అంశాలను వెల్లడించారు. ప్రజారక్షణలో ఇతర భద్రతా పరమైన సవాళ్లు ఎలా అధిగమిస్తున్నారో వివరించారు. కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేయడంలో జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఎలా పనిచేస్తుందో ఆయా వివరాలను తెలిపారు.