కవితను ఎవరూ కాపాడలేరు.. త్వరలో జైలుకెళ్లడం ఖాయం: అశ్విన్​ కుమార్​

కవితను ఎవరూ కాపాడలేరు..  త్వరలో జైలుకెళ్లడం ఖాయం:  అశ్విన్​ కుమార్​

హైదరాబాద్, వెలుగు :  లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కేసీఆర్ కూతురు కవితను ఎవరూ కాపాడలేరని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే స్పష్టం చేశారు. త్వరలో ఆమెకు శిక్ష పడటం, జైలుకు వెళ్లడం ఖాయమని తేల్చి చెప్పారు. బుధవారం సోమాజిగూడలో బీజేపీ మీడియా పాయింట్ లో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ ఆప్ ప్రభుత్వంతో కలిసి లిక్కర్ స్కామ్ కు పాల్పడిందని, ఢిల్లీలో కేజ్రీవాల్, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరూ ప్రజలను దోచుకుంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో చీకటి రోజులు పోయే రోజులు దగ్గరపడ్డాయని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. 

ఇచ్చిన హామీలను అమలు చేయటంలో కేసీఆర్ విఫలం అయ్యారని, మిషన్ భగీరథలో పెద్ద ఎత్తున కమీషన్లు తీసుకున్నారని, 24 గంటలు ఇంటింటికీ తాగునీళ్లు వస్తాయని చెప్పారని, 4 గంటలు కూడా రావటం లేదన్నారు. రాష్ర్ట ప్రజలను తాగుబోతులుగా, యువకులను మద్యం బానిసలుగా మార్చారని, భాగ్యనగర్ ను శరాబ్ నగర్ గా మార్చారని ఆయన ఆరోపించారు. సింగరేణిని ఆగం చేశారని, దళిత బంధు, డబుల్ బెడ్​రూమ్​ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ధరణి భూములను దోచుకునే పోర్టల్ అని అశ్వినీ కుమార్ చౌబే మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ధరణి రద్దు చేసి, భూముల సర్వే చేసి డిజిటలైజేషన్ చేస్తామన్నారు. 

విశ్వంలోనే అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్ అని, ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ.. అమర్, అక్బర్, అంథోనిలా మారతారన్నారు. అవసరానికి తగినట్లుగా రూపం మార్చుకుంటారని ఎద్దేవా చేశారు. అవినీతిపరులు, కమీషన్లు తీసుకునే వారిని, దేశాన్ని దోచుకునే వారిని కాపాడుతున్నారని, బీఆర్ఎస్​ సర్కార్ వెనుకున్నది కాంగ్రెస్ కాదా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ‘సి’ టీమ్ కాంగ్రెస్ అని, అవినీతి పరులతో ఇండియా కూటమి ఏర్పాటు చేశారని, కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు  బిల్లా రంగా లాగా మారాయన్నారు.  కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ కు అవార్డులు ఇవ్వలేదని, జైళ్లకు పంపిస్తామన్నారు.