- కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
- బీజేపీలోకి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్ పర్సన్ విజయ
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో మజ్లిస్‌లో ఓ వర్గం నేతలతో కాంగ్రెస్, మరో వర్గంతో బీఆర్ఎస్ నేతలు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని మతం పేరుతో కుట్రలు చేయాలనుకుంటున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. తాము మాత్రం అభివృద్ధి మంత్రంతోనే ప్రజల్లోకి వెళుతున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లీడర్, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, ఆమె భర్త గణపతి గురువారం కరీంనగర్‌లో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారితోపాటు కరీంనగర్ బల్దియా, జమ్మికుంటకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర నిధులతోనే కరీంనగర్‌లో అభివృద్ధి పనులు సాగుతున్నాయని, బీజేపీని గెలిపిస్తే మరిన్ని నిధులు తీసుకొచ్చి సిటీ రూపురేఖలు మారుస్తానని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, లీడర్లు బాస సత్యనారాయణ, ఓదెలు పాల్గొన్నారు.
