V6 News

మేధావుల మౌనం సమాజానికి అరిష్టం : మంత్రి బండి సంజయ్

మేధావుల మౌనం సమాజానికి అరిష్టం : మంత్రి బండి సంజయ్
  • డీలిమిటేషన్, మహిళా బిల్లుపై నోరు విప్పాలి
  • మహిళా రిజర్వేషన్లు అంబేద్కర్ ఆలోచనల్లో భాగమే
  • కరీంనగర్  మేధావుల సదస్సులో కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలపై మేధావులు పెదవి విప్పాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్  అన్నారు. మేధావుల మౌనం సమాజానికి అరిష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్  బాబా సాహెబ్  అంబేద్కర్  జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లో సోమవారం రాత్రి నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడారు.

 ‘‘మేధావులకు రాజకీయాలతో పనిలేదు. వ్యక్తులతో పనిలేదు. సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్  బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదు. ఇకనైనా మౌనం వీడండి” అని సంజయ్  వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అంబేద్కర్  ఆలోచనల్లో భాగమేనని, వాటిని అమలు చేయాలని మోదీ ప్రభుత్వం ముందుకొస్తే, కాంగ్రెస్  పార్టీ అడ్డుకుని మహిళలకు అన్యాయం చేసిందని విమర్శించారు.

నెహ్రూ ఏకపక్ష విధానాలను ప్రశ్నించిన అంబేద్కర్ ను పార్లమెంట్ లో అడుగుపెట్టకుండా కాంగ్రెస్  రెండుసార్లు ఓడించిందని, కానీ.. జనసంఘ్ పార్టీ అంబేద్కర్ ను బెంగాల్ లో ఎమ్మెల్సీగా చేసిందని గుర్తు చేశారు. బీజేపీ మద్దతుతోనే నాటి వీపీ సింగ్ ప్రభుత్వం ఏర్పడగానే 1990లో అంబేద్కర్​కు భారత రత్న పురస్కారాన్ని ప్రకటించిందని తెలిపారు. ఈ సదస్సులో కరీంనగర్  కార్పొరేషన్  మేయర్  కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్  సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.