హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మొత్తం చెల్లించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని కేంద్రమంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. బకాయిలు ఇవ్వకపోతే విద్యార్థులు, మేనేజ్‌మెంట్లతో కలిసి మంత్రులను రోడ్లపై తిరగనివ్వబోమని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ నల్లకుంటలోని శంకర్‌మఠ్‌ను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా శృంగేరి పీఠాధిపతి విదుశేఖర భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో కమీషన్లు రావనే చెల్లించట్లేదా అని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. “బకాయిలు చెల్లించాలని అడిగితే విజిలెన్స్ దాడులతో యాజమాన్యాలను బ్లాక్‌మెయిల్ చేస్తారా? విద్యార్థులు, మేనేజ్‌మెంట్ల భవిష్యత్తుతో చెలగాటమాడ్తరా? కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ చేస్తే తాము చూస్తూ ఊరుకుంటామా?” అంటూ హెచ్చరించారు.
అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని కూడా కాలరాయడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి భయపడి కాలేజీ మేనేజ్‌మెంట్లు సమ్మె విరమిస్తే.. భవిష్యత్‌లో ఎవరూ అండగా నిలబడే పరిస్థితి ఉండదన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలపైనా నిలదీస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.
