
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము మొదటి నుంచి సీబీఐ విచారణే కోరామని..ఇప్పుడు అది నిజమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం అవినీతి, అక్రమాలకు పూర్తి బాధ్యత బీఆర్ఎస్ దేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. బీజేపీ మొదటి నుంచి కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరుతున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ ను కాపాడాలనే ఉద్దేశంతో చర్యలు ఆలస్యం చేసిందని విమర్శించారు.
అయితే, చివరకు నిజానికి తలవంచి సీబీఐ విచారణకు అంగీకరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సీబీఐకి లేఖ పంపాలని డిమాండ్ చేశారు. గతంలో ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై అసెంబ్లీలో సిట్ ను ప్రకటించినా, అది నేటికీ ఆచరణలోకి రాలేదని బండి సంజయ్ గుర్తుచేశారు. అదేవిధంగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఇప్పటికీ డైలీ సీరియల్‌లా కొనసాగుతోందని ఆయన ఎద్దేవా చేశారు.
సీబీఐకి అప్పగించడం మంచిదే: ఈటల
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడం మంచిదేనని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ‘ కాంగ్రెస్ కు చేతకాదని మాకు తెలుసు. వాళ్ల రిపోర్టు తప్పుల తడక. అది నిలవదని కాంగ్రెస్ కు అర్థమైంది. కాబట్టే డిస్ ఓన్ చేసుకోవడానికి ఈ పని చేశారు. సీబీఐ సమగ్ర దర్యాప్తు చేస్తుందనే నమ్మకముంది. కాళేశ్వరంపై జరిగిన అక్రమాలను బయటపెడుతుందని విశ్వాసం ఉంది" అని పేర్కొన్నారు.