
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని నిర్ధారణ కావడంతో బండి సంజయ్ స్టేట్మెంట్ను సిట్ రికార్డ్ చేసింది. దాదాపు రెండు గంటల పాటు బండి సంజయ్ ను సిట్ విచారించింది. 45 నిమిషాల పాటు బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బందిని సిట్ ప్రశ్నించింది. బండి సంజయ్ అనుచరుడు మధుని సిట్ ప్రశ్నించింది.
బండి సంజయ్ మాజీ పీఏ తిరుపతి, పీఆర్వో ప్రవీణ్లను సిట్ విచారించింది. సిట్ కు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం.. బయటకు వచ్చి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎక్కువగా తన ఫోన్లే ట్యాపింగ్ చేశారని చెప్పారు. కేసీఆర్ తన ఫోనే ఎక్కువ ట్యాప్ చేశారని, మావోయిస్టులు లిస్ట్లో తమ పేర్లు పెట్టి ఫోన్ ట్యాప్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. మావోయిస్టుల లిస్టులో కేసీఆర్ అల్లుడి పేరు కూడా ఉందని బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించిందని, వాళ్లకు వావీవరుసలు ఏవీ లేవని బండి నిప్పులు చెరిగారు. తన ఫోన్, తన కుటుంబ సభ్యులు, తన సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పారు. కేసీఆర్ బిడ్డ కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారని బండి సంజయ్ కీలక ఆరోపణ చేశారు. తన దగ్గర ఉన్న ఆధారాలు, తనకు తెలిసిన సమాచారం సిట్కు ఇచ్చానని మీడియాకు తెలిపారు.
సిట్ వాళ్లు ఫోన్ ట్యాపింగ్ విషయాలు చెబుతుంటే షాకయ్యానని, భార్యాభర్తల ఫోన్లు కూడా విన్న మూర్ఖులని బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బంధువుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పారు. కేసీఆర్ బంధువులను కూడా విచారణకు పిలిపించాలని సిట్కు చెప్పానని బండి సంజయ్ వెల్లడించారు. ప్రభాకర రావు, రాధా కిషన్ రావులు పెద్ద లఫంగలు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.