
హైదరాబాద్: కాళేశ్వరం అంశం డైవర్ట్ చేయడానికే కవిత రాజీనామా డ్రామా ఆడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేయడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కవిత రాజీనామా డ్రామాతో కాళేశ్వరం ఇష్యూను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. అసలు కవిత రాజీనామా చేస్తే ఎంతా.. చేయకపోతే ఎంతా అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగిందని, కేసీఆర్ సొంత బిడ్డ కవిత కూడా ఇదే విషయం చెప్పిందన్నారు. భూమి మీద జరిగిన అతిపెద్ద అవినీతి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఆరోపించారు బండి సంజయ్.
పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ వేటు వేయడంతో కవిత ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు పంపించారు. శాసన మండలి సభ్యత్వానికి రిజైన్ చేసిన లేఖను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించారు. హరీష్ రావు, సంతోష్ రావే కుట్ర చేసి తనను సస్పెండ్ చేసేలా కుట్ర చేశారని కవిత ఆరోపించారు.