కుటుంబ పాలనలో తెలంగాణ బందీ :  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  

కుటుంబ పాలనలో తెలంగాణ బందీ :  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  
  • పదేండ్లు కేసీఆర్.. ఇప్పుడు సోనియమ్మ చేతిలో రాష్ట్రం 
  • ఆరు గ్యారంటీలు కాదు.. అవన్నీ 420 మోసాలు 
  • పరేడ్ గ్రౌండ్ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  

హైదరాబాద్, వెలుగు:  పదేళ్ల పాటు కేసీఆర్ కుటుంబ పాలనలో నలిగిపోయిన తెలంగాణ.. ఇప్పుడు సోనియా గాంధీ కుటుంబం చేతిలో బందీగా మారిందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. అప్పుడు ఒక కుటుంబం, ఇప్పుడు మరో కుటుంబం రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాయని చెప్పారు.  సికింద్రాబాద్​పరేడ్​గ్రౌండ్​లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను నట్టేట ముంచిందని, ఇచ్చిన హామీలను గాలికొదిలేసి రాష్ట్ర నిధులను ఢిల్లీకి తరలించడమే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని ప్రశ్నించే వారికి తమ అభివృద్ధి పనులే సమాధానమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేషనల్ హైవేల కోసం రూ. 1.85 లక్షల కోట్లు ఇచ్చామని, 5 వందే భారత్ రైళ్లు, 6 అమృత భారత్ రైళ్లు, 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, 3 బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు ఇచ్చామని,..  ఇవన్నీ రాహుల్ గాంధీ ఇచ్చారా? లేక కేసీఆర్ తెచ్చారా? అని నిలదీశారు. సన్నబియ్యం పథకానికి కూడా కేంద్రమే 80 శాతం నిధులు ఇస్తోందని వెల్లడించారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే: లక్ష్మణ్ 

రాష్ట్రంలో పార్టీల పేర్లు వేరైనా.. వాటి విధానాలన్నీ ఒక్కటేనని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిస్తేనే ఎంఐఎం అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. ఈ మూడు పార్టీలు కుమ్మక్కై తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల జయకేతనం ఎగురవేసిన ఊపుతో.. ఇప్పుడు వై నాట్ తెలంగాణ? అనే లక్ష్యంతో ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చారని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ అజెండా కేవలం దేశాభివృద్ధేనని లక్ష్మణ్ కొనియాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందని, మార్పు కోసం కాంగ్రెస్‌‌‌‌కు అవకాశమిస్తే ప్రజల ఆశలు అడియాశలయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని కరప్షన్, కమిషన్, కమ్యూనలిజం పార్టీగా లక్ష్మణ్ అభివర్ణించారు. కాంగ్రెస్‌‌‌‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని, కేవలం ఒక వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ బీసీల హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే బిల్లును కూడా కాంగ్రెస్ అడ్డుకుందని గుర్తు చేశారు. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ నేతల వైఖరి హిందూ ధర్మానికి వ్యతిరేకంగానే ఉందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. నాడు సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని నెహ్రూ అడ్డుకుంటే.. నేడు అయోధ్య రామమందిరాన్ని రాహుల్ గాంధీ ద్వేషిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో రామరాజ్యం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. 

హిందూస్తాన్‌‌‌‌లో జై శ్రీరాం అనక.. ఎక్కడ అంటాం?: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

‘హిందూస్తాన్‌‌‌‌లో జై శ్రీరాం అనకుండా ఇంకెక్కడ అంటాం? జై శ్రీరాం అంటే పైసలు వస్తాయా అని అడుగుతున్న కాంగ్రెస్ మంత్రులకు బుద్ధి వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని కించపరిచిన స్టాలిన్, హిందువులను అవమానించిన కేసీఆర్ ఏమయ్యారో అందరికీ తెలుసని గుర్తు చేశారు. మేం బరాబర్ జై శ్రీరాం అంటామని, తమ ధర్మాన్ని కించపరిస్తే సహించబోమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తులు ఉండవు, ఒంటరిగానే పోరాడి గెలుస్తామని మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు, ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రానున్నదని చెప్పారు. బెంగాల్ విజయం తర్వాత తెలంగాణలో మోదీ తెలంగాణలో అడుగుపెడుతున్నారని, అంటే టార్గెట్ తెలంగాణ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు హామీలతో అన్ని వర్గాలను ప్రజలను మోసం చేశాయన్నారు.

 ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌‌‌‌కు అభివృద్ధిపై సోయి లేదని, ఎక్కడ ల్యాండ్ కనిపిస్తే అక్కడ అమ్మడం, దోచుకోవడం, ఆ సొమ్మును ఢిల్లీకి పంపడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ అప్పుల ఊబిలోకి నెట్టేసిందన్నారు. ఈ సభలో బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటీ సుధాకర్ రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు,  ధర్మపురి అర్వింద్,  ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, ధన్ పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

420 సబ్ గ్యారంటీలతో మోసం!

కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసానికి మారుపేరని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు 420 సబ్ గ్యారంటీలతో ప్రజలను వంచిస్తోందన్నారు. అందుకే ప్రజలు వరుసగా మూడుసార్లు మోదీకి పట్టం కట్టారని అన్నారు. ప్రస్తుతం దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ సర్కార్లు ఉన్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతోందని, కాంగ్రెస్ అంటే ముస్లింలు అన్నట్లుగా వ్యవహరిస్తోందని, మరి ఆ పార్టీలో హిందువులు ఉండొద్దా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ఇప్పుడు మద్యానికి అడ్డాగా మారిపోయిందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌తో సమానంగా 8 ఎంపీ సీట్లను గెలుచుకున్నామని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఏ హామీ ఇచ్చినా తప్పకుండా అమలు చేస్తుందని, కాంగ్రెస్‌‌‌‌లా మాట తప్పదని స్పష్టం చేశారు.