న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ నెల (అక్టోబర్ 5)లో దాయాది దేశం పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. పాక్ వేదికగా జరగునున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జైశంకర్ పాకిస్థాన్‌కు వెళ్లనున్నారు. మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ 2015లో చివరగా ఇస్లామాబాద్‌లో పర్యటించారు. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఏ భారత విదేశాంగమంత్రి పాక్‌ను సందర్శించలేదు. 9 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు జైశంకర్ పాకిస్థాన్ పర్యటనకు వెళ్తున్నారు.
జైశంకర్ పాక్ పర్యటన నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చల గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా దీనిపై జైశంకర్ క్లారిటీ ఇచ్చారు. ఇవాళ (అక్టోబర్ 5) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్- పాకిస్థాన్ సంబంధాలపై చర్చించేందుకు తాను ఇస్లామాబాద్ వెళ్లడం లేదని ఊహాగానాలకు చెక్ పెట్టారు. ఎస్‌సీఓలో భారత్ సభ్య దేశంగా ఉందని.. కేవలం భారత దేశం తరుఫున ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు మాత్రమే పాకిస్థాన్ పర్యటనకు వెళ్తున్నానని స్పష్టం చేశారు. రెండు పొరుగు దేశాల మధ్య చెడిపోయిన సంబంధాల గురించి ఈ పర్యటన సందర్భంగా చర్చించే అవకాశమే లేదని అన్నారు.
ALSO READ | ఇజ్రాయెల్కు 15 వేల మందిని పంపుతున్నరు.. మోదీ సర్కార్పై ఖర్గే ఫైర్
కాగా, అక్టోబర్ 15, -16 తేదీల్లో పాకిస్థాన్ వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు కూటమి సభ్యదేశాలు భారతదేశం, చైనా, రష్యా, పాకిస్తాన్, కజాఖ్స్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లు హాజరుకానున్నాయి. ఈ ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న సమావేశాలకు హాజరుకావాలని ప్రధాని మోడీకి ఆహ్వానం అందింది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం తరుఫున కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో భారత్ బృందం ఈ సమావేశాలకు వెళ్లనుంది.