
మొదటిసారి డ్రోన్ లో ఒక కొత్త ఆవిష్కరణ చూస్తున్నాం..మానవ మనుగడకు ఈ డ్రోన్ లు ఈవిధంగా ఉపయోగపడటం సంతోషకరమన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా. శనివారం ఆమె వికారాబాద్ లో మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సిందియా.. ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణకే కాదు.. దేశానికే గర్వకారణం అన్నారు. డ్రోన్ టెక్నాలజీ గురించి చాలా విన్నామని.. ఇది ఒక టెక్నాలజీ మాత్రమే కాదు.. ఇది ఒక విప్లవత్మకమైన చర్య అన్నారు. ఇలాంటి అభివృద్ధితో ప్రపంచానికి మనం మార్గదర్శకంగా ఉండబోతున్నామని.. మందులను డ్రోన్ లతో పంపిణీ చేయడం అంటే దేశానికే కాదు.. ప్రపంచానికి మనం ఆదర్శం అన్నారు. అందుకు తెలంగాణ వేదిక అయిందని..ప్రధాని మోడీ కల ఇది అన్నారు. సామాన్యులకు ఎంతో అత్యవసరమైన ఇటువంటి ఆవిష్కరణ జరగడం సంతోషం..ప్రజలకు ఉపయోగరకరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రధాని మోడీ కొన్ని కఠినతరమైన చట్టాలను సులభతరం చేశారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా తెలిపారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. వికారాబాద్ లో మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ తో కలిసి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమర్జింగ్ టెక్నాలజీని ఎంతో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈరోజు చారిత్రాత్మక దినమని.. సాంకేతిక వినియోగంపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తారని, సామాన్యుడికి ఉపయోగంలేని సాంకేతికత వ్యర్థమని చెబుతారన్నారు.
ఈ క్రమంలోనే అధునాత టెక్నాలజీతో మందులను సరఫరా చేస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా మందులు, రక్తం సరఫరా చేయవచ్చని తెలిపారు. ఆరోగ్య రంగంలోనే కాదు, అనేక రంగాల్లో డ్రోన్లను వాడొచ్చని చెప్పారు. మహిళల భద్రత కోసం కూడా డ్రోన్లను వాడుతున్నామని, అమ్మాయిలను వేధించే వాళ్లు డ్రోన్ చప్పుళ్లకే భయపడతారని చెప్పారు. మైనింగ్ లాంటి అక్రమాలకు పాల్పడే ప్రాంతాలను కట్టడి చేయవచ్చన్నారు. బేగంపేట విమానాశ్రయాన్ని ఏరోస్పేస్ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఏవియేషన్ వర్సిటీగా మార్చాలని మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రిని సింధియాను కోరారు.
అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ప్రోగ్రాం ప్రారంభించడం సంతోషకరమన్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజల హెల్త్ మీద సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారని తెలిపారు. టెక్నాలజీ, వైద్య రంగాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.