13 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరిస్తం : కిషన్ రెడ్డి

13 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరిస్తం : కిషన్ రెడ్డి
  • 13 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరిస్తం

  • రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచాలె: కిషన్ రెడ్డి

  • బియ్యం రీ సైకిల్ దందాను అరికట్టాలని సూచన

న్యూఢిల్లీ, వెలుగు : 2021–22 యాసంగి, 2022–23 వానాకాలం సీజన్​లకు సంబంధించిన 13.73 లక్షల టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం ఓకే చెప్పిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మే 31 వరకు ఎఫ్​సీఐకి అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పర్మిషన్ ఇచ్చినట్లు బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2021-–22 యాసంగికి సంబంధించి 15 లక్షల టన్నుల పార్ బాయిల్డ్ రైస్ ను తెలంగాణ రైతుల నుంచి సేకరించేలా పర్మిషన్ ఇవ్వాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్​కు గతంలో తాను లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు.

కనీస మద్దతు ధర చెల్లించి తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం అత్యధిక మొత్తంలో బియ్యాన్ని సేకరిస్తోందని తెలిపారు. అయితే బియ్యం సేకరణ పెరుగుదలకు తగినట్లు మిల్లింగ్ సామర్థ్యం పెంచుకోవాలని అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినా.. విఫలమైందని విమర్శించారు. ఈ ఏడాది రబీ కాలం పూర్తయినా.. ఇంకా గతేడాది రబీ పంట బియ్యాన్ని ఎఫ్ సీఐకీ అందించలేకపోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. అలాగే కొందరు మిల్లర్లు చేస్తోన్న రీసైకిల్డ్ బియ్యం దందాను అరికట్టడంలోనూ రాష్ట్ర సర్కార్ ఫెయిల్ అయిందని ఆరోపించారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసే దిశలో సానుకూలంగా స్పందిచిన నేపథ్యంలో.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని టైమ్​కు ధాన్యాన్ని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సకాలంలో ఎఫ్​సీఐకి బియ్యాన్ని అందించాలని సూచించారు.