
సికింద్రాబాద్, వెలుగు: జనాలకు ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్యంపై రాజకీయం చేయొద్దని, పార్టీలకు అతీతంగా కలిసి వచ్చి మాణికేశ్వర్నగర్లో హాస్పిటల్ నిర్మాణానికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. జనాల డిమాండ్లను లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తే జనాల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. తార్నాక డివిజన్ పరిధి మాణికేశ్వర్ నగర్లో హాస్పిటల్ నిర్మాణం కోసం దీక్ష చేస్తున్న బస్తీ వాసులతో ఆయన మాట్లాడారు. మాణికేశర్వర్ నగర్లోని ఓయూకు చెందిన స్థలంలో హాస్పిటల్ నిర్మించాలని కొన్నిరోజులుగా స్థానికులు దీక్ష చేస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించాలన్నారు. ప్రభుత్వం, యూనివర్సిటీ స్థలం ఇస్తే కేంద్ర నిధులతో ఇక్కడ ఎయిమ్స్ ఎక్స్టర్నల్ హాస్పిటల్ నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పోలీస్ బుల్లెట్ల నుంచి స్టూడెంట్లను అక్కున చేర్చుకొని, కడుపులో పెట్టుకొని ఉద్యమానికి ఊపరి పోసిన మాణికేశ్వర్నగర్ వాసులకు అండగా ఉంటానని ఆయన చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో పార్కులు, థియేటర్ ,పెట్రోల్ బంకులు, హోటళ్లను నిర్మించే రాష్ట్ర సర్కారు..పేద, మధ్యతరగతి జనాల కోసం హాస్పిటల్ కడితే తప్పేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అవసరమైతే సీఎస్, ఓయూ వీసీ మాట్లాడానికి తాను సిద్ధమని ఆయన వెల్లడించారు.