బీఆర్ఎస్ నేతలందరూ బీజేపీలో చేరండి

బీఆర్ఎస్ నేతలందరూ బీజేపీలో చేరండి
  • ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 
  • లోక్​సభ ఎన్నికల్లో అసలు పోటీలోనే ఉండదు
  • మేం ఒంటరిగానే బరిలోకి దిగుతం
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డూప్ ఫైట్ జరుగుతున్నదని ఫైర్  

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ కు ఇక తెలంగాణలో భవిష్యత్తు లేదని, ఆ పార్టీ నేతలందరూ బీజేపీలో చేరాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘బీఆర్ఎస్ లోని గ్రామస్థాయి కార్యకర్తలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరుతున్నారు. ఆ పార్టీ క్యాడర్ మొత్తం బీజేపీలో చేరాలని నేను పిలుపునిస్తున్నాను. బీఆర్ఎస్ కు ఇక తెలంగాణలో భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ పదేండ్లు కేసీఆర్ కుటుంబం చుట్టే తిరిగింది. కేసీఆర్ కుటుంబానికే సేవ చేసింది” అని అన్నారు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు పోటీలోనే ఉండదని ఆయన అన్నారు. ఆ పార్టీ ఒకట్రెండు సీట్లు గెలిచినా తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు.  

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సెటిల్మెంట్.. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డూప్ ఫైటింగ్ జరుగుతున్నదని కిషన్ రెడ్డి అన్నారు. ‘‘బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ దర్యాప్తు చేయిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది. మేడిగడ్డ బ్యారేజీ లోపాలకు సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అయితే ఇవన్నీ బయటపడకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సెటిల్మెంట్ జరిగింది. ఈ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కృష్ణా నదిలో నీటి పంపకాలను బీఆర్ఎస్ తెరపైకి తెస్తున్నది. నాగర్జునసాగర్ ప్రాజెక్టును ఏపీ స్వాధీనం చేసుకుంటే.. నాటి సీఎం కేసీఆర్ నిమ్మకునీరెత్తినట్టు ఉన్నారు. తన ఇంటికి జగన్ వచ్చినప్పుడు నీటి సమస్యలను కేసీఆర్ ఎందుకు పరిష్కరించలేదు” అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లపై బెదిరింపులకు పాల్పడుతోందని..  ఢిల్లీకి సూటుకేసులు మోసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ దయనీయ స్థితిలో ఉందని, అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో తమకు ఆ పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా ఉందన్నారు.

ఇయ్యాల ఎన్నికల కమిటీ భేటీ.. 

బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ శుక్రవారం సమావేశం కానుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై చర్చిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన ప్రజలు.. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.

బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి భేటీ
లోక్ సభ ఎన్నికలపై చర్చ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. గురువారం ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి డి.కె. అరుణ, బండి సంజయ్, ఈటెల రాజెందర్, సునీల్ బన్సల్ లు హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్యూహాలపై నేతలు చర్చించారు. రాష్ట్రంలో అధికార పార్టీని ఎదుర్కోనే అంశంపై నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలో చేరికలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి నేతలకు సూచించారు.