6 నెలల్లో కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే:కిషన్ రెడ్డి

 6 నెలల్లో కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే:కిషన్ రెడ్డి

తెలంగాణ బడ్జెట్ సమావేశాలను సీఎం కేసీఆర్ తన పొలిటికల్ సమావేశాలుగా మార్చుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్రాన్ని తిట్టేందుకే కేసీఆర్ అసెంబ్లీని వాడుకున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో డబుల్ బెడ్ రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, విద్యార్థుల సమస్యలు, గ్రామాల్లోని కేసీఆర్ బెల్టు షాపులు, ధరణి సమస్యలపై  చర్చిస్తే బాగుండేదన్నారు.  కానీ అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ ను పొగిడేందుకు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి బడ్జెట్ సమావేశాలా..? లేక మోడీపై విద్వేశ వ్యక్తం చేసే సమావేశాలా అని ప్రశ్నించారు. 

 
కేసీఆర్ సవాల్ ను స్వీకరిస్తున్నా..

సీఎం కేసీఆర్ తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఒక్క మాట మాట్లాడలేదన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితులపై కేసీఆర్ కు అవగాహన లేదన్నారు. కేసీఆర్ దేశ ఆర్థిక పరిస్థితులతో పాటు..విదేశాల ఆర్థిక పరిస్థితులపై గుగూల్ లో సెర్చ్ చేయాలని సూచించారు. బంగ్లాదేశ్ , సింగపూర్, శ్రీలంక దేశాలతో పోల్చుతూ...దేశ ఆర్థిక పరిస్థితిపై తక్కువ చేసే ప్రయత్నం కేసీఆర్ చేశారని మండిపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించాలని కేసీఆర్ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్థూపం, ప్రగతి భవన్, ఫాం హౌస్ లేదా ఎక్కడైనా దేశ ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ తో చర్చించేందుకు సిద్దమన్నారు. 

ఎన్నికల్లో ఓడిన తర్వాత రాజీనామా చేయాల్సిందే..

మాట్లాడితే రాజీనామాకు సిద్ధమంటూ కేసీఆర్ ప్రకటిస్తున్నారని..రాజీనామాకు అంత తొందరెందుకు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక ఎలాగూ రాజీనామాను రాజ్ భవన్ లో ఇవ్వక తప్పదన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల దోపిడి జరుగుతుందని ఆరోపించారు. రాష్టం ఏర్పడినప్పుడు 60 వేలకోట్ల అప్పు ఉంటే ఇప్పుడు 5 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. కమీషన్ల కోసమే అప్పులు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిన తిరుమల రాయుని పిట్టకథ కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వర్తిస్తుందని చురకలంటించారు.