ప్రగతి భవన్ కాదు.. కల్వకుంట్ల భవన్.. అధికారంలోకి రాగానే ప్రజల భవన్ గా మారుస్తం: కిషన్ రెడ్డి 

ప్రగతి భవన్ కాదు.. కల్వకుంట్ల భవన్.. అధికారంలోకి రాగానే ప్రజల భవన్ గా మారుస్తం: కిషన్ రెడ్డి 

ప్రగతి భవన్ కాదు.. కల్వకుంట్ల భవన్

అధికారంలోకి రాగానే ప్రజల భవన్ గా మారుస్తం: కిషన్ రెడ్డి 

బషీర్ బాగ్/సికింద్రాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్ ప్రగతి భవన్​ను కల్వకుంట్ల భవన్​గా మార్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను ప్రజల భవన్​గా మారుస్తామని పేర్కొన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ ప్రోగ్రామ్​లో భాగంగా శనివారం సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి పర్యటించారు. వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.  కాచిగూడలోని లింగంపల్లి చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్ర సర్కార్ హైదరాబాద్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్​ను మాఫియా నగరంగా మార్చారని మండిపడ్డారు. నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారని, ఆఖరికి మూసీ నదిని కూడా వదిలిపెట్టడం లేదని ఫైర్ అయ్యారు. అంబర్ పేటలో అక్రమ కేసులు పెడుతూ ప్రజలను భయపెడుతున్నారని అన్నారు. ‘‘రాష్ట్రంలో దోపిడీ పాలన నడుస్తున్నది. ఆ దోపిడీ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలి. ప్రధాని మోదీ ప్రజాస్వామ్య పాలనను తెలంగాణలో తీసుకురావాలి” అని కార్యకర్తలకు కిషన్​రెడ్డి పిలుపునిచ్చారు.  

అమరులను మరిచిన్రు.. 

తెలంగాణ అమరవీరులను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని, తాము అధికారంలోకి వచ్చినంక తగిన గౌరవం కల్పిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతున్నదని, దానికి చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతున్న టైమ్​లోనూ మనదేశం ఆర్థికంగా వృద్ధి సాధించిందని, ఇదంతా ప్రధాని మోదీ వల్లనే సాధ్యమైందని అన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మోదీ వైపు చూస్తున్నాయని చెప్పారు. ‘‘మోదీ సుపరిపాలనలో దేశం ప్రశాంతంగా ఉన్నది. గతంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరుగుతుండేవి. మేం అధికారంలోకి వచ్చినంక ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేసినం” అని తెలిపారు.