
- జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్‌పై కిషన్ రెడ్డి ఫైర్
- దిశా మీటింగ్‌కు హాజరుకాకపోవడంపై ఆగ్రహం
- వారిద్దరిపై కేంద్రానికి లేఖ రాస్తానని హెచ్చరిక
హైదరాబాద్,వెలుగు:జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, కమిషనర్ రొనాల్డ్ రోస్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లాలో కేంద్ర పథకాల అమలుపై నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ సమితి(దిశా) మీటింగ్‌కు వారు హాజరు కాకపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. శనివారం బేగంపేటలోని హరిత ప్లాజాలో దిశ మీటింగ్జరిగింది.
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, జీ హెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్రెడ్డి ,హెచ్‌ఎండబ్ల్యూ ఎస్‌ఎస్‌బీ ఎండీ దానకిషోర్,హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ సహా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
కాగా, మూడు నెలల ముందే మీటింగ్ డేట్ నిర్ణయించినా అటెండ్ కాకపోవడంపై కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దిశా సమావేశం ఉందని తెలిసి కూడా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఎట్లా పెట్టుకుంటరని ప్రశ్నించారు. దిశా మీటింగ్ ప్రాధాన్యతను గుర్తించాలని సూచించారు. ఇది మంచి సంప్రదాయం కాదని పేర్కొన్నారు.
అధికారుల నిర్లక్ష్య ధోరణిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని హెచ్చరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ల అమలుపై కిషన్‌రెడ్డి అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. జీహెచ్ఎంసీ సహకారం లేని కారణంగా పనులు పెండింగ్‌లో పడుతున్నాయని తెలిపారు.
ఇలాంటి అంశాల గురించి వివరించేందుకు మేయర్, కమిషనర్ అందుబాటులో లేకపోవడంపై ఆయన మండిపడ్డారు. బస్తీల్లో మురుగునీరు వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
దిశా మీటింగ్‌లో అధికారుల వివరణ
కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వెల్‌నెస్ సెంటర్ల వివరాలను ఆరోగ్య శాఖ అధికారులు అందించారు. నగరంలోని 154 బస్తీ దవాఖానాలు,89 యూపీహెచ్‌సీలను వెల్‌నెస్ సెంటర్లుగా మార్చినట్లు తెలిపారు. టీబీ పేషెంట్లను దత్తత తీసుకుంటామని, దత్తత తీసుకునే అంశంపై విస్తృత ప్రచారాన్ని కల్పిస్తే చాలా మంది టీబీ పేషేంట్లను దత్తత తీసుకోవడానికి ముందుకొస్తారని సూచించారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. నగరంలో సోషియో ఎకనామిక్ సర్వే ను నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. లాటరీ ద్వారా ఇండ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు. బ్యాంకర్లతో 10 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి పీఎం స్వనిధి, ముద్రరుణాలపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
రైల్వే శాఖ నిర్మించనున్న రోడ్స్ గురించి జీహెచ్‌ఎంసీ, రైల్వే అధికారులతో కలిసి సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.