లోక్ సభ ఎన్నికలంటే ధర్మ యుద్ధం : కిషన్​రెడ్డి

లోక్ సభ ఎన్నికలంటే ధర్మ యుద్ధం : కిషన్​రెడ్డి
  •     తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలు గెలుచుకుంటం
  •     కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ధీమా

సికింద్రాబాద్, వెలుగు : పార్లమెంట్​ఎన్నికలు ధర్మ యుద్దం లాంటివని, రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం సికింద్రాబాద్​లోక్​సభ నియోజకవర్గంలోని మొండా డివిజన్, గ్యాస్ మండి స్పోర్ట్స్ గ్రౌండ్స్ లో ఓపెన్ జిమ్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఓయూలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. తర్వాత లాలాపేట వినోభానగర్​లో ఏర్పాటు చేసిన ఓపెన్​జిమ్​ను ప్రారంభించారు.

ఈ సందర్బంగా కిషన్​రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన పదేండ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రజలంతా మరోసారి మోదీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్టీయే కూటమి 400 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని అన్ని లోక్​సభ స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్​లో అసదుద్దీన్ ఒవైసీని ఓడించి బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత దేశంలో నాలుగు సెక్టార్లుగా పనిచేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి, మోండా డివిజన్​కార్పొరేటర్ కొంతం దీపిక , పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.