సంగీత నాటక అకాడమీకి10 ఎకరాల భూమి ఇవ్వండి

సంగీత నాటక అకాడమీకి10 ఎకరాల భూమి ఇవ్వండి

హైదరాబాద్ , వెలుగు: రీజనల్ సంగీత నాటక అకాడమీ నిర్మాణానికి హైదరాబాద్ లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ సీఎం కేసీఆర్​కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.  సంగీత నాటక అకాడమీకి మణిపూర్, ఢిల్లీలో 2 యూనిట్స్ ఉండగా.. మరో 5 సెంటర్లు కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కాకతీయుల కాలంలో గొల్ల సుద్దులు, ఒగ్గు కథలు, గోత్రాలు, పేర్ని శివతాండవం ఎంతో ఖ్యాతి గడించాయన్నారు. తెలంగాణలో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువని..  గుస్సాడీ, లంబాడీ, మయూరి , దింప్సా నృత్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సంస్కృతిని అద్దంపట్టే  ఇటువంటి కళలను మరింత ప్రోత్సహించేందుకు హైదరాబాద్ లో రీజనల్ సంగీత నాటక అకాడమీ ఏర్పాటు చేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించిందన్నారు. ఇందులో లైబ్రరీ, ఆడిటోరియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలుగు ప్రజల సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి  ముందుకు రావాలని లేఖలో ఆయన కోరారు. ఇప్పటికే నిర్మించిన భవనాన్ని అప్పగించినా..దాన్ని కేంద్ర సాంస్కృతిక  శాఖ  డెవలప్ చేసి, అందులో సంగీత నాటక అకాడమీని ఏర్పాటు చేస్తుందని 
వెల్లడించారు.