ఉచిత ఎరువుల హామీ ఏమైంది?.. సీఎం కేసీఆర్‌‌‌‌కు కిషన్‌‌ రెడ్డి ప్రశ్న

ఉచిత ఎరువుల హామీ ఏమైంది?.. సీఎం కేసీఆర్‌‌‌‌కు కిషన్‌‌ రెడ్డి ప్రశ్న
  • ఎన్నికలొస్తున్నాయనే రుణమాఫీ
  • మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌‌కి లేదని ఫైర్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల రైతులకు మేలు జరగడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొను గోలులోనూ విఫలమైన అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. ఉచిత ఎరువుల హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులను అన్ని రకాలుగా మోసం చేస్తున్న, కౌలు రైతుల కష్టాలను అర్థం చేసుకోలేని కేసీఆర్‌‌‌‌ సర్కారుకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు.

గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సమగ్ర పంట బీమా పథకాన్ని అమలు చేయకుండా మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న టైమ్‌‌లో రైతు రుణమాఫీని తెరపైకి తీసుకొచ్చి.. రైతులను ఆగమాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నాలుగున్నరేండ్ల కింద ఇచ్చిన రుణాలకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రెట్టింపయ్యాయి” అని ఆరోపించారు. లక్షలాది మంది కౌలు రైతుల బతుకులను చీకట్లోకి నెట్టిన ఘన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదేనని కిషన్‌‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను ఆదుకునేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు.

ధాన్యం సేకరణ మొదలుకుని, యూరియా సబ్సిడీ, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థికంగా చేయూత వంటి కార్యక్రమాలు చేపట్టి.. విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. ‘‘రైతుబంధే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌కు బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు బంధు, బీమా ఇవ్వకపోవటంతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ నష్టపోతున్నారన్నారు. 

రైతు ఘోష, బీజేపీ భరోసా బహిరంగ సభ

ఈనెల 27న రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఖమ్మంలో ‘రైతు ఘోష, బీజేపీ భరోసా’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చి.. అక్కడి నుంచి భద్రాచలం వెళ్లి సీతరామచంద్రస్వామిని అమిత్ షా దర్శించుకుంటారని చెప్పారు. తర్వాత ఖమ్మం వస్తారని, రైతులను ఉద్దేశించి షా మాట్లాడుతారని వివరించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామనే దానిపై స్పష్టమైన డిక్లరేషన్ ఇవ్వబోతున్నామని చెప్పారు. కాగా, తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావడంపై కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 

మహిళలకు ఏడు టికెట్లేనా?

‘‘మహిళా రిజర్వేషన్లపై సీఎం కూతురు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో దీక్ష చేశారు. లిస్ట్ చూస్తే ఎంత మందికి టికెట్లు ఇచ్చారో అర్థమవుతున్నది. మహి ళా రిజర్వేషన్‌‌పై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదు. మొదటి ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకుండా పాలన సాగించారు. మహిళా బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెడితే అడ్డుకున్న నేతలను కేసీఆర్ ప్రగతి భవన్ కు పిలుచుకొని విందులు ఏర్పాటు చేస్తారు. కేసీఆర్  ప్రకటించిన అభ్యర్థుల్లో ఏడుగురు మహిళకే స్థానం కల్పించి.. మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది” అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

ప్రజా సమస్యలపై..   నేడు కలెక్టరేట్ల ముట్టడి

ప్రజా సమస్యలపై శుక్రవారం బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ ప్రోగ్రామ్స్ సక్సెస్ చేసేందుకు పార్టీ స్టేట్​ చీఫ్ కిషన్ రెడ్డి నేతలను నియమించారు. హైదరాబాద్ కలెక్టరేట్ దగ్గర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఆదిలాబాద్ లో ఎంపీ బాపురావు, నిజామాబాద్ లో ఎంపీ అర్వింద్, కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్, మంచిర్యాలలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మెదక్ లో మాజీ ఎంపీ విజయశాంతి, సిద్దిపేటలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, యాదాద్రిలో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మహబూబ్ నగర్ లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, గద్వాలలో డీకే అరుణ, మహబూబాబాద్​లో రవీంద్ర నాయక్ పాల్గొంటారు.3