ఎస్సీ వర్గీకరణను మేనిఫెస్టోలో చేరుస్తం: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి 

ఎస్సీ వర్గీకరణను మేనిఫెస్టోలో చేరుస్తం: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి 

కంటోన్మెంట్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే చట్టబద్ధత రానుందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. అయితే సుప్రీం కోర్టులో పూర్తిస్థాయి విచారణ జరిగి స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని ఆయన వెల్లడించారు.  

సికింద్రాబాద్​మిలీనియం గార్డెన్​లో మంగళవారం ఎమ్మార్పీఎస్​ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశానికి కిషన్​రెడ్డి హాజరై మాట్లాడారు. వర్గీకరణ బిల్లు చట్టబద్ధతకు కేంద్రం కృషి చేస్తుందని, సుప్రీం కోర్టులో వాదనలు దాదాపుగా పూర్తయ్యాయని, ఏడుగురు జడ్జిల బెంచ్​ తీర్పు కూడా వర్గీకరణకు సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల సుప్రీం కోర్టులో వర్గీకరణపై జరిగిన పరిణామాలపై ఎమ్మార్పీఎస్ ​అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వివరించారు. సమావేశంలో జాతీయస్థాయి ఎమ్మార్పీఎస్, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.