లింగాయత్ల డిమాండ్లను నెరవేర్చేందుకు కృషి చేస్తం : కిషన్ రెడ్డి

లింగాయత్ల  డిమాండ్లను నెరవేర్చేందుకు కృషి చేస్తం : కిషన్ రెడ్డి
  • కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబా హామీ
  • లింగాయత్​లకు కాంగ్రెస్  అండగా ఉంటది: మాణిక్ రావ్​
  • వారి అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ పెట్టాలి: కృష్ణయ్య
  • నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​లో లింగాయత్ మహాసభ

బషీర్ బాగ్, వెలుగు : తమను బీసీ ‘డీ’ నుంచి ఓబీసీలో చేర్చాలని లింగాయత్ సమాజం చేస్తున్న డిమాండ్​పై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భగవంత్  ఖుబా స్పందించారు. ఈ విషయంతో పాటు పలు డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించి, వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తామని లింగాయత్ సమాజం నాయకులకు వారు హామీ ఇచ్చారు. హైదరాబాద్  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో లింగాయత్  సమన్వయ సమితి తెలంగాణ ఆధ్వర్యంలో లింగాయత్  మహా ర్యాలీ, సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  కేంద్ర మంత్రులు భగవంత్  ఖుబా, కిషన్ రెడ్డి, ఎంపీ ఆర్.కృష్ణయ్య, వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గురువులు, లింగాయత్ సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు మాట్లాడుతూ, లింగాయత్ సమాజం ఆధ్యాత్మిక సమాజమని, గొప్ప సమాజమని పేర్కొన్నారు. అనేక మంది మంత్రులు, నాయకులు కర్నాటక  లింగాయత్ సమాజం  నుంచి వచ్చిన వారేనని, అలాగే తెలంగాణలో కూడా లింగాయత్​లు ఐక్యంగా రాజకీయంగా ఎదగాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏ సమావేశానికి వెళ్లినా బసవేశ్వరుడి ఆశీస్సులు తీసుకొంటారని గుర్తుచేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి లింగాయత్​ ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాషాయం దేశభక్తికి, ఆధ్యాత్మికత సేవకు ప్రతిరూపమని పేర్కొన్నారు. లింగాయత్​ల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్   వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్‌‌ రావ్‌ ఠాక్రే  హామీ ఇచ్చారు. లింగాయతులంతా బసవేశ్వర వారసులని, వారి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్  ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. లింగాయత్ లను ఓబీసీలో చేర్చడానికి తాను పోరాడుతానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వారికి 10 ఎమ్మెల్యేలు, నాలుగు ఎంపీ టికెట్లు 
ఇవ్వాలన్నారు.