దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం

దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం

బషీర్ బాగ్, వెలుగు : శిలాశాసనాలు మన వారసత్వ సంపద అని, వాటిని మనం రక్షించుకుంటే చరిత్రను కాపాడుకున్నట్లే అనికేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. శిలాశాసనాలను కాపాడే బాధ్యత ప్రతిఒక్కరిదని ఆయన పేర్కొన్నారు. జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందని శిలాశాసనాల ద్వారానే కోర్టు తీర్పు చెప్పిందని గుర్తుచేశారు. దేశంలోనే తొలి ఎపిగ్రఫీ (రాళ్లు, లోహాలు, కలప వంటి వస్తువులపై రాసిన శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రం) మ్యూజియానికి హైదరాబాద్ లోని సాలార్​జంగ్  మ్యూజియంలో సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.

మన చరిత్ర, అస్థిత్వం, ప్రాచీన సంప్రదాయాలకు శిలాశాసనాలు ప్రతీక అని, ఆనాటి కళ, పాలనా వ్యవస్థలు శాసనాలలో ప్రతిఫలిస్తాయన్నారు. శాసనాలు, తామ్రపత్రాలు, శిలా శాసనాలు లాంటి పురాతన వస్తువులు లభిస్తే, వెంటనే పురావస్తు శాఖకు , ప్రభుత్వ దృష్టికి తేవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రముఖ ఎపిగ్రఫిస్ట్  టీఎస్  రవిశంకర్  మాట్లాడుతూ.. శాసనాల‌‌‌‌‌‌‌‌ పరిరక్షణ, అధ్యయనానికి సంబంధించి ఎపిగ్రఫీ మ్యూజియం ఒక విలక్షణ సదుపాయమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో లభ్యమైన శాసనాలను ఈ మ్యూజియంలో ఉంచుతామని, ఇంటరాక్టివ్, డిజిటల్  బుక్  రూపంలో కూడా శాసనాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.  హిందీ, ఇంగ్లిష్ , బ్రాహ్మీ భాషలలో కూడా ఈ శాసనాలను తెస్తామని తెలిపారు. ఎపిగ్రఫిస్టు ఎన్ఎస్  రామచంద్రమూర్తి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో వివిధ కాలాలకు చెందిన శాసనాలు.. దేశంలో వివిధ కాలాల్లో ఆయా ప్రాంతాలు పోషించిన కీలక పాత్రను ప్రతిఫలిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అదనపు డైరెక్టర్  జనరల్  గురుమీత్ సింగ్  చావ్లా , సాలార్ జంగ్  మ్యూజియం క్యూరేటర్  డాక్టర్  ఘనశ్యామ్  కుసమ్,  ఏఎస్ఐ  డైరెక్టర్ (ఎపిగ్రఫీ) మునిరత్నం,  పురావస్తు విభాగం ఉన్నతాధికారులు పాల్గొన్నారు.