మన్ కీ బాత్.. ఓ సామాజిక విప్లవం

మన్ కీ బాత్.. ఓ సామాజిక విప్లవం

హైదరాబాద్/ న్యూఢిల్లీ, వెలుగు: ‘మన్​ కీ బాత్’​తో ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని ప్రతి ఫ్యామిలీకి దగ్గరయ్యారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. దేశ ప్రజలంతా మోడీని ఓ ఫ్యామిలీ మెంబర్​గా భావిస్తున్నారని తెలిపారు. ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గంలో మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్​ను స్థానిక ప్రజలతో కలిసి కిషన్ రెడ్డి చూశారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.  సమాజంలో సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించడమే మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ఉద్దేశమన్నారు. ‘‘బిల్ గేట్స్ లాంటి వ్యక్తి కూడా మన్ కీ బాత్​లో పాల్గొన్నారు. ఇది ఒక పార్టీ, రాజకీయపరమైన కార్యక్రమం కాదు. సమాజంలో మార్పులు, ప్రజలు ఎలా ముందుకు వెళ్తున్నారో ప్రధాని వివరిస్తున్నారు. సేవ చేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారు. ఎలా సేవ చేయొచ్చో మోడీ తెలియజేస్తున్నారు. వంద ఎపిసోడ్స్​లో వేలాది మంది జీవితాల గురించి మోడీ ప్రజలకు వివరించారు”అని కిషన్ రెడ్డి అన్నారు.

మీడియాను ఇన్వైట్ చేయకపోవడం కరెక్ట్ కాదు

తెలంగాణ ఉద్యమంలో మీడియా కీలక పాత్ర పోషించిందని, రాష్ట్ర ఏర్పాటు కోసం జర్నలిస్టులు ఎంతో పోరాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మీడియా స్వేచ్ఛను అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. సెక్రటేరియెట్ ఓపెనింగ్​ సందర్భంగా వీ6, వెలుగుతో పాటు మరికొన్ని చానల్స్, పత్రికల జర్నలిస్టులను ఇన్వైట్​ చేయకపోవడం కరెక్ట్​ కాదన్నారు. నిజాం రాచరిక ఆలోచనలతో కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. మీడియా సంస్థలపై నిషేధం విధించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించడం పత్రికలు, చానెల్స్ హక్కు అని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే ఎంట్రీ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. 2016 నుంచి సెక్రటేరియెట్​కు రాకుండా పాలన సాగించారన్నారు. ప్రజలు రావడానికి అవకాశం లేని ప్రగతిభవన్.. సీఎం రాని సెక్రటేరియెట్ ఎందుకని ప్రశ్నించారు.

మన్ కీ బాత్.. ఓ సామాజిక విప్లవం

‘మన్ కీ బాత్’ సమాజంలో ఓ సామాజిక విప్లవంగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్​ను పురస్కరించుకొని ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ ప్రాంగణంలో మోడీ ప్రస్తావించిన పలు అంశాల ఆధారంగా ఆర్ట్ ఎగ్జిబిషన్​ను ఏర్పాటుచేశారు. ఈ గ్యాలరీని మంత్రి మీనాక్షి లేఖితో కలిసి కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు సమర్థవంతంగా తెలియజేయడంలో మన్ కీ బాత్ ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపిందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూనే.. వారి శక్తి సామర్థ్యాలను ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ.. వారిని కూడా సమాజం, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడంలో మోడీ విజయం సాధించారని చెప్పారు.