బస్తీ సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసింది: కిషన్ రెడ్డి

బస్తీ సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసింది: కిషన్ రెడ్డి

రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధి అంటే హైటెక్ సిటీ వైపే చూపిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కానీ ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్తో పాటు..పలు డివిజన్లలోని ప్రజల సమస్యలను మాత్రం గాలికొదిలేసిందని మండిపడ్డారు. బస్తీల్లో తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని తెలిపారు. రోడ్లు సరిగా లేక, మురుగునీరు పారుతూ జనం అవస్థలు పడుతున్నారని చెప్పారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్ డివిజన్ హనుమాన్ టెంపుల్ కమ్యూనిటీ హాల్ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్రను నిర్వహించారు. డివిజన్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

అంతకుముందు హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్, మల్లేపల్లి డివిజన్లలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఆఫీస్ నగర్ డివిజన్ పరిధిలోని దాయిబాగ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష  నిర్వహించారు. డివిజన్లో నెలకొన్న సమస్యలపై అధికారులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడిగి  తెలుసుకున్నారు. డివిజన్లో స్ట్రీట్ లైట్లు, గుంతలకు సంబంధించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో మజ్లీస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బస్తీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీని మాత్రమే అభివృద్ధి చేస్తుందన్నారు. బస్తీలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధిలైట్లకు నిధులు కేటాయించని పరిస్థితి నెలకొందన్నారు. అందుకే  హైదరాబాద్లో బస్తీలు అద్వానంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.