యావత్ ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తోంది

యావత్ ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తోంది

న్యూఢిల్లీ, వెలుగు: ‘వసుధైక కుటుంబం’ ఒక నినాదం మాత్రమే కాదని, భారతీయ జీవన విధానమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ నినాదం ప్రపంచ శాంతికి భారతదేశం అందించిన మంత్రమని ఆయన చెప్పారు. యావత్ ప్రపంచమంతా ఇండియా వైపు గౌరవభావంతో చూడడానికి కారణం మన సంస్కృతి, సంప్రదాయాలే అని అన్నారు. శనివారం మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ (డబ్ల్యూఓఎస్‌‌వై) ఆధ్వర్యంలో ‘సంస్కృతి ,-సుస్థిరమైన భవిష్యత్ భాగస్వామ్యం’  థీంతో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సదస్సులో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలోని 17 ఐకానిక్ సిటీల్లో ఖజురహోను చేర్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఖజురహోలో రైల్వేతోపాటు ఇతర వసతుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచే స్తున్నాయని ఆయన పేర్కొన్నారు.  ‘భారతీయ సంస్కృతి, జీవన విధానం చాలా ప్రత్యేకమైనది. ప్రపంచంలోని మరే ఇతర దేశానికీ సాధ్యంకాని రీతిలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కనబరిచే ఏకైక దేశం భారతదేశం’ అని కిషన్​వ్యాఖ్యానించారు. వచ్చే 25 ఏండ్ల కాలంలో (అమృత్ కాల్) దేశాన్ని మరోసారి విశ్వగురువుగా నిలబెట్టే దిశగా అందరూ తమ వంతు ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. ప్రధాని సూచించినట్లు సమస్యల నుంచి అవకాశాలను సృష్టించుకుంటూ, అంతర్జాతీయ యవనికపై దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాలన్నారు.