
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీల వరకు యూత్ డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు అందరం ఐక్యంగా పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ 75వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఆదివారం బీజేవైఎం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ‘నమో యువ 3కే రన్’ కార్యక్రమం నిర్వహించారు.
అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ వరకు కొనసాగిన ఈ రన్‌ను కిషన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ‘నశాముక్త్ భారత్’ (డ్రగ్స్ ఫ్రీ) లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘‘మన దేశంలో యువత ఎక్కువగా ఉన్నారు. కానీ ఆ యూత్ ఇప్పుడు దారితప్పుతున్నది. వాళ్లను కాపాడుకోవడం దేశ భవిష్యత్తుకు చాలా ముఖ్యం. ప్రపంచాన్ని శాసించగలిగే శక్తి భారత యువతకు ఉంది” అని అన్నారు.
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నదని పేర్కొన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా భారత్ అవతరించాలంటే, డ్రగ్స్ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, ఎమ్మెల్యే హరీశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.