- అమెరికా, జపాన్ కంటే మన దేశంలో పెరుగుదల తక్కువే
- ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలపై ఫైర్
హైదరాబాద్, వెలుగు: దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సి వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, యుద్ధం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం అనివార్యమైందని పేర్కొన్నారు. బుధవారం పెట్రోల్ ధరల పెంపుపై ఆయన మీడియాతో మాట్లాడా రు. ప్రభుత్వం ప్రజలపై భారం మోపాలని ఈ నిర్ణయం తీసుకోలేదని, గతంలోనూ భారం పడకుండా భారీ గా సబ్సిడీలు ఇచ్చామని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
అమెరికా, జర్మనీ, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు 40 శాతం మేర పెరిగినా, భారత్‌లో మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లోనే స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని వివరించారు. దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలంటే ప్రభుత్వ ఆదాయం దెబ్బతినకూడదని కిషన్ రెడ్డి వివరించారు. పెట్రోల్ ధరల పెంపుపై కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఫైర్అయ్యారు. వాస్తవాలను దాచిపెట్టి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు.
