
- అట్ల ఎందుకన్నరో రేవంత్‌నే అడగండి
- కాంగ్రెస్ గ్యారంటీలు పేపర్లకే పరిమితమైనయ్
- మన మోదీ ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట డిజిటల్ క్యాంపెయిన్లు
- ఎల్ఈడీ ప్రచార రథాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి
హైదరాబాద్, వెలుగు: మోదీని పెద్దన్న అని సీఎం రేవంత్ రెడ్డి అన్నంత మాత్రాన బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయినట్టా అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఆ మాట ఎందుకన్నారో రేవంత్‌నే బీఆర్ఎస్ లీడర్లు అడిగి తెలుసుకుంటే బాగుంటుందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు పేపర్‌కే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. వాటి వల్ల ఎంత మందికి ప్రయోజనం కలుగుతున్నదో తెలియదుగానీ.. ప్రచారం మాత్రం ఆర్భాటంగా చేస్తున్నారని విమర్శించారు.
మంగళవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. పదేండ్లలో రాష్ట్రానికి కేంద్రం అందించిన నిధులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై పార్టీ సీనియర్ నేతలతో కలిసి పుస్తకాన్ని విడుదల చేశారు. తర్వాత లోక్‌సభ ఎన్నికల కోసం ఎల్ఈడీ ప్రచార రథాల(వీడియో వ్యాన్స్)ను జెండా ఊపి ప్రారంభించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం రెండు రకాల క్యాంపెయిన్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ‘మన మోదీ’ ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ పేరుతో డిజిటల్ క్యాంపెయిన్లు, వీడియో వ్యాన్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్తామని పేర్కొన్నారు.
వీడియో వ్యాన్స్కూడా
డిజిటల్ క్యాంపెయిన్లతో పాటు ‘వీడియో వ్యాన్స్’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. పదేండ్లలో మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎల్ఈడీ వీడియో వ్యాన్ల ద్వారా వివరిస్తామని చెప్పారు. వికసిత భారత్ సంకల్ప పత్రం కోసం బుధవారం నుంచి అన్ని మండల కేంద్రాల్లో సజెషన్ బాక్సులను ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ తదితరులు పాల్గొన్నారు.
గ్యారంటీల అమలులో స్పష్టత లేదు
తెలంగాణతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మన మోదీ క్యాంపెయిన్ ద్వారా వివరిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. మౌలిక వసతుల కల్పన, సంక్షేమ ఫలాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. పదేండ్ల పాలనలో ఏం చేశామన్నదానిపై ప్రజలకు చెప్తామన్నారు. వెబ్సైట్, ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ద్వారా కూడా మన మోదీ క్యాంపెయిన్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు.
ప్రజలకు కాంగ్రెస్ అట్టహాసంగా ఆరు గ్యారంటీలను ఇచ్చిందని, కానీ, వాటి అమలులో మాత్రం స్పష్టత ఇవ్వలేదన్నారు. దీనిపై తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. అందుకే మేనిఫెస్టోలో పెట్టిన హామీలు, ఆరు గ్యారంటీల అమలును ప్రశ్నిస్తూ ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.