ప్లాస్టిక్ వాడకం తగ్గించాల్సిందే

ప్లాస్టిక్ వాడకం తగ్గించాల్సిందే

గోవా, వెలుగు: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను రీయూజ్, రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అప్పుడే పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయొచ్చన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక దేశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గోవాలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న జీ20 పర్యాటక మంత్రుల స్థాయి సమావేశాల సందర్భంగా ‘మేకింగ్ సస్టేనబుల్ క్రూయిజ్ టూరిజం మోడల్ ఫర్ సస్టేనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ ట్రావెల్’, ‘టువర్డ్స్ ఎ సర్క్యులర్  ఎకానమీ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ టూరిజం: ద గ్లోబల్ టూరిజం ప్లాస్టిక్ ఇనిషియేటివ్’ అనే అంశాలపై జరిగిన రెండు వేర్వేరు చర్చలను కేంద్రమంత్రి సోమవారం ప్రారంభించారు. 

దేశంలో  టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను, క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను కిషన్ రెడ్డి వివరించారు. దేశంలో క్రూయిజ్ టూరిజాన్ని డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గంగానది ప్రక్షాళన, ఇతర నదుల పరిసర ప్రాంతాల్లోనూ నీట్​నెస్​ను ప్రోత్సహించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో క్రూయిజ్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సమస్యలు వస్తున్నాయని, అన్ని దేశాలు చర్చించి ఓ కార్యాచరణతో ముందుకెళ్లేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయన్నారు. గోవా రోడ్‌‌ మ్యాప్‌‌ను వచ్చే ఏడాది బ్రెజిల్​లో జరిగే  జీ20 సమావేశాల్లో చర్చిస్తారని చెప్పారు