కూలిపోతున్న మావోయిస్టుల నెట్‌‌‌‌వర్క్..గడ్చిరోలిలో 61 మంది లొంగుబాటు కీలక మలుపు : బండి సంజయ్

కూలిపోతున్న మావోయిస్టుల నెట్‌‌‌‌వర్క్..గడ్చిరోలిలో 61 మంది లొంగుబాటు కీలక మలుపు : బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: మావోయిస్టుల నెట్ వర్క్ కూలిపోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గడ్చిరోలిలో 61 మంది మావోయిస్టుల లొంగుబాటు నక్సల్ నిర్మూలనలో కీలక మలుపు అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్​లో ట్వీట్ చేశారు. గడ్చిరోలి ప్రాంతంలో వారి ఉనికికి గట్టి దెబ్బగా, సీనియర్ మావోయిస్టు లీడర్ మల్లోజుల వేణుగోపాల్ రావు 60 మంది దళ సభ్యులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారని తెలిపారు. 

ఈ పరిణామం కేంద్రమంత్రి అమిత్ షా దృఢమైన వ్యూహానికి ప్రతిబింబమని చెప్పారు. 2026 మార్చి నాటికి నక్సలిజం పూర్తి నిర్మూలన స్పష్టంగా అమలవుతోందని పేర్కొన్నారు. అంతర్గత భద్రత పట్ల ఆయన రాజీలేని వైఖరి, దృఢమైన అమలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నట్టు చెప్పారు. ఆయన మాటలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నాయని చెప్పడానికి ఈ లొంగుబాటులే నిదర్శనమని తెలిపారు. ‘అస్త్రాలు వదలండి. లొంగిపోండి..’ ప్రభుత్వం చెప్పిందే చేస్తోందని ట్వీట్ చేశారు.