- చెప్పింది చేసే నైపుణ్యం ఒక్క మోదీలోనే ఉందని ప్రశంస
- గత 12 ఏండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి
- ప్రపంచ ఐఫోన్లలో 25% భారత్‌లోనే తయారవుతున్నట్లు వెల్లడి
- తెలంగాణ అభివృద్ధిలో వివక్ష లేదని వ్యాఖ్యసికింద్రాబాద్‌లో జరిగిన
- మేధావుల సమ్మేళనంలో ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పాలనంటేనే కుంభకోణాలని.. మోదీ పాలనంటేనే ప్రజా సంక్షేమమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్‌లో జరిగిన మేధావుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన 2జీ, కామన్వెల్త్ వంటి లక్షల కోట్ల స్కాముల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సైనికుల భద్రత కూడా దెబ్బతిన్నదని రాజ్‌నాథ్ విమర్శించారు.
రాజకీయంలో నాయకుడికి ఉండాల్సిన అతిపెద్ద ఆస్తి 'విశ్వసనీయత' అని.. చెప్పింది చేసే నైపుణ్యం ఒక్క మోదీలోనే ఉందని కొనియాడారు. మోదీ ప్రభుత్వం దళారీ వ్యవస్థను పూర్తిగా తుడిచిపెట్టడం వల్లే ఢిల్లీ నుంచి పంపే ప్రతి రూపాయి నేరుగా పేదల బ్యాంకు ఖాతాలకే చేరుతోందని స్పష్టం చేశారు. అలాగే, దేశంలోకి వచ్చే అక్రమ చొరబాటుదారులను సరిహద్దుల బయటకు పంపుతామన్న మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోందని చెప్పారు. గత 12 ఏండ్ల సుపరిపాలనలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తులను చేశామని.. జన్ ధన్ ఖాతాలు, ఉచిత వైద్యం వంటి పథకాలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు.
కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్ల గతంలో ఉపాధి అవకాశాలు చైనాకు తరలిపోగా.. మోదీ తెచ్చిన 'మేక్ ఇన్ ఇండియా' వల్ల నేడు ప్రపంచ ఐఫోన్లలో 25 శాతం భారత్‌లోనే తయారవుతున్నాయని వివరించారు. రక్షణ రంగ ఎగుమతులు రూ. 39 వేల కోట్లకు చేరాయని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం వివక్ష చూపబోదని.. గతంలో రైల్వే బడ్జెట్ వెయ్యి కోట్ల లోపే ఉంటే ఇప్పుడు తెలంగాణకే రూ. 5,500 కోట్లు కేటాయించామని తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ సాధించేందుకు తెలంగాణ ప్రజల మద్దతు కావాలని రాజ్‌నాథ్ కోరారు.
12 ఏండ్లలో ఒక్క సెలవు తీసుకోలేదు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ గత 12 ఏండ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా అంకితభావంతో దేశ సేవ చేస్తున్నారని కొనియాడారు. తన తల్లి చనిపోయిన రోజున కూడా వ్యక్తిగత బాధను పక్కనపెట్టి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న గొప్ప వ్యక్తిత్వం మోదీదని ప్రశంసించారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామాలయ నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి నిర్ణయాలతో దశాబ్దాల పెండింగ్ సమస్యలను మోదీ పరిష్కరించారని చెప్పారు. పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా ఆయన క్లీన్ పాలన అందిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
దేశ భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ వంటి సాహసోపేత నిర్ణయాలతో భారత సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత మోదీదేనన్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని, సాయుధ దళాల్లో మహిళలకు ఉన్నత స్థానాలు కల్పిస్తూ నారీశక్తికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసి చరిత్ర సృష్టించిన మోదీ.. 2029లో కూడా మళ్లీ గెలిచి, వికసిత భారత్ లక్ష్యాన్ని పూర్తి చేస్తారని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. సమ్మేళనంలో ఎంపీలు డీకే అరుణ, రఘునందర్ రావు, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, పలువురు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
మిషన్ సుదర్శన్ చక్ర వచ్చేస్తోంది
హైదరాబాద్, వెలుగు: మారుతున్న యుద్ధ పద్ధతులకు అనుగుణంగా దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్‌లో డీఆర్‌డీఓకు చెందిన 'అడ్వాన్స్‌డ్ వెపన్ సిస్టమ్స్ కాంప్లెక్స్'ను ప్రారంభించారు. అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌ను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో మన దేశం చుట్టూ ఒక బలమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
దేశంలోని సైనిక స్థావరాలు, కీలక మౌలిక సదుపాయాలు, ముఖ్యమైన సంస్థలను శత్రువుల దాడుల నుంచి రక్షించడానికి 'మిషన్ సుదర్శన్ చక్ర'ను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఇది ఆధునిక భారతదేశానికి ఒక బలమైన మల్డీ లెవల్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గా పనిచేస్తుందని వివరించారు. శత్రువులు దాడికి ప్రయత్నిస్తే.. వారికి గట్టి బుద్ధి చెప్పే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంటుందని చెప్పారు. డీఆర్‌డీఓ తయారు చేసిన ఆకాష్, బ్రహ్మోస్ వంటి క్షిపణి వ్యవస్థలు దేశానికి కొండంత బలాన్ని ఇస్తున్నాయని కొనియాడారు.
