
జేఏసీగా ఆర్టీసీ యూనియన్లు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలోని పలు యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడి సమ్మె చేయనున్నాయి. గురువారం జరిగిన సమావేశంలో గుర్తింపు యూనియన్ టీఎంయూ నిర్ణయం తీసుకుంది. జేఏసీగా శుక్రవారం అధికారిక ప్రకటన చేయనుంది. సమ్మెకు జేఏసీగా వెళ్లాలని ఇటీవల పలు యూనియన్లు టీఎంయూకు లేఖలు రాశాయి. సమస్యల పరిష్కారానికి అన్ని యూనియన్లు వేర్వేరుగా సమ్మె నోటీసులు ఇచ్చాయి. జేఏసీగా ఏర్పడితేనే సమ్మె ఉధృతంగా కొనసాగుతుందని, దీంతో ప్రభుత్వంపై ప్రభావం ఉంటుందని యూనియన్లు అభిప్రాయపడుతున్నాయి.
ద్రోహం చేసేందుకే జేఏసీ: టీజేఎంయూ
ఆర్టీసీ కార్మికులకు మరోసారి ద్రోహం చేయడానికే జేఏసీని ఏర్పాటు చేస్తున్నారని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మండిపడ్డారు. టీఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, సూపర్వైజర్ అసోసియేషన్ కలిసి జేఏసీ పేరుతో కార్మికులకు మోసం చేయనున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. ఈ సంఘాల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్ అనే యూనియన్ ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ పెట్టలేదన్నారు.