
ఖైరతాబాద్, వెలుగు: కనీస గౌరవ వేతనంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్య వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.లేకుంటే జూన్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవదిక సమ్మెకు దిగుతామని ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఐక్య వేదిక చైర్మన్ నాయకోటి రాజు,ఉపాధ్యక్షుడు బత్తుల రమేశ్ బాబు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన రేషన్ డీలర్లకు కనీస గౌరవ వేతనం హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు. డీలర్లు చనిపోతే వారి కుటుంబంలోని వ్యక్తికే సదరు రేషన్ షాపును కేటాయించడంతో పాటు రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నారు. త్వరలో తెలంగాణ ఉద్యమం మాదిరిగానే వంట వార్పు, చలో హైదరాబాద్ పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు.