కామన్ రిక్రూట్ మెంట్ బోర్డును రద్దు చేయాలె

కామన్ రిక్రూట్ మెంట్ బోర్డును రద్దు చేయాలె

హైదరాబాద్: కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా వర్సిటీల్లోని ఖాళీలు భర్తీ చేస్తామంటున్న ప్రభుత్వ ప్రకటనతో కాంట్రాక్టు లెక్చరర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యూలర్ చేయకుండా  కొత్త వారిని తీసుకోవడం ఏంటనీ వారు ప్రభుత్వాన్ని  ప్రశ్నిస్తున్నారు. ముందుగా తమ సమస్యలు పరిష్కరించాకే... ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తన్నారు. తెలంగాణలో కాంట్రాక్టు లెక్చరర్ల  ఫ్యూచర్ అయోమయోంలో పడింది. రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయనుకున్న ఎంతో మంది లెక్చరర్లు.. తమ భవిష్యత్తుపై ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 11 వర్సిటీల్లో 980 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న  కాంట్రాక్టు లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియను సర్కార్ ప్రారంభించింది.  అయితే ఎన్నో ఏళ్లుగా వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ల పోస్టుల రెగ్యులరైజేషన్ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

 తెలంగాణ వస్తే కాంట్రాక్టు అనే పదం ఉండదన్న అప్పటి ఉద్యమ నేత ప్రస్తుత సీఎం కేసీఆర్.. ఇప్పుడు  కాంట్రాక్టు లెక్చరర్లను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.  కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసేందుకు 2016లోనే జీవో నెంబర్ 16ను ప్రభుత్వం విడుదల చేసిందని వారు చెబుతున్నారు.  ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఇది అమలు కావడం లేదు. జీవోలో ఉన్న నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించేందుకు అన్ని అర్హతలు తమకు ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు.  
దేశంలోని పలు రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులర్ చేశాయని వారు చెబుతున్నారు.
తమను ముందుగా రెగ్యులర్ చేశాకే.. వర్సిటీల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను కామన్ బోర్డు ద్వారా భర్తీ చేయాలంటున్నారు. లేదంటే ఆ బోర్డును రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.