‘ఉన్నావ్​ రేప్’ బాధితురాలి హత్యకు కుట్ర

‘ఉన్నావ్​ రేప్’ బాధితురాలి  హత్యకు కుట్ర

హాస్పిటల్లో ప్రాణాలతో పోరాటం

    ఆమె ప్రయాణిస్తున్న
కారును ఢీకొట్టిన ట్రక్కు

    రాయ్​బరేలి జైలులోని బాబాయిని చూసి
వస్తుండగా ఘటన

    ప్రమాదంలో ఆమె పిన్ని,
మరో బంధువు మృతి

    లాయర్​ మహేంద్ర సింగ్​
పరిస్థితి విషమం

 ట్రక్కు నంబర్​కు నల్ల రంగు వేసి ఉండడంపై అనుమానాలు

లక్నో: ఉన్నావ్​ రేప్​ బాధితురాలు ఘోర రోడ్డు ప్రమాదంలో చావుబతుకులతో పోరాడుతోంది. ఆదివారం ఆమె వెళుతున్న కారును ఉత్తర్​ప్రదేశ్​లోని రాయ్​బరేలికి 15 కిలోమీటర్ల దూరంలో ట్రక్కు ఢీకొట్టింది. రాయ్​బరేలి జైలులో ఉన్న బాధితురాలి బాబాయి మహేశ్​ సింగ్​ను చూసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఆమె బంధువులు ఇద్దరు మరణించారు. చనిపోయిన వారిని ఆమె పిన్ని పుష్ప, మరో బంధువు షీలాగా గుర్తించారు. షీలా ఘటనా స్థలంలోనే చనిపోగా, పుష్ప ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఆమె లాయర్​ మహేంద్ర సింగ్​ తలకు తీవ్రగాయాలవడంతో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను లక్నోలోని కేజీఎంయూ (కింగ్​ జార్జ్​ మెడికల్​ యూనివర్సిటీ) ట్రామా సెంటర్​కు తరలించారు. రేప్​ బాధితురాలికి, మహేంద్ర సింగ్​కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు ఓనర్​ దేవేంద్ర సింగ్​, డ్రైవర్​ ఆశిష్​ పటేల్​లను పోలీసులు అరెస్ట్​ చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఫోరెన్సిక్​ సైన్స్​ నిపుణులు పరిశీలించారు. ఉన్నావ్​ రేప్​ కేసు సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. 2017లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్​ సింగ్​ సెంగార్​, తనను కిడ్నాప్​ చేసి రేప్​ చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఆ టైంలో ఆ ఘటన పెద్ద దుమారాన్నే రేపింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో బాధితురాలి తండ్రిపై సెంగార్​ అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ఆమె తండ్రి మరణించాడు. ఇప్పుడిలా రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చావుబతుకులతో పోరాడుతోంది.

ఇది యాక్సిడెంట్​ కాదని, పక్కా ప్లాన్​ ప్రకారమే కావాలని ట్రక్కుతో ఢీకొట్టించారని ఆమె తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. కేసును వెనక్కు తీసుకునేలా చేసేందుకే ఇలా చేశారంటున్నారు. రాయ్​బరేలి జైలుకు వెళుతున్నామన్న సంగతి గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలుసని చెప్పారు. ట్రక్కు నంబర్​ కనిపించకుండా ప్లేట్​కు నల్లరంగు వేయడం మరిన్ని అనుమానాలుకు తావిస్తోంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.