24 గంటల్లో రిపోర్ట్ చేయకుంటే క్రిమినల్ కేసులే

24 గంటల్లో రిపోర్ట్ చేయకుంటే క్రిమినల్ కేసులే

భోపాల్ : నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్లిన వారు 24 గంటల్లో అధికారులకు రిపోర్ట్ చేయాలని మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. లేదంటే రాష్ట్ర, దేశ భద్రతకు ముప్పుగా పరిగణించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చిన వారే ఎక్కువ ఉన్నారు. చాలా మంది ని గుర్తించి వారిని క్వారంటైన్ కు తరలించారు. కొంతమంది ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదు. వీరి ద్వారా ఇతరులకు కరోనా సోకే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళనతో ఉంది. ఈ నేపథ్యంలోనే నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చిన వారంతా రిపోర్ట్ చేయాలని సీఎం అప్పీల్ చేశారు. “ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిలో చాలా మందిని గుర్తించాం. మసీదుల్లోదాక్కున్న విదేశీయులను గుర్తించి క్వారంటైన్ కు పంపించాం. ఇంకా కొంతమంది ఆచూకీ లేదు. వారిని 24 గంటల్లో రిపోర్ట్ చేయాలని కోరుతున్నాం. లేదంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం” అని హెచ్చరించారు.