ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను.. పోలీస్‌‌ స్టేషన్‌‌లోనే కాల్చి చంపేసిండు..

ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను.. పోలీస్‌‌ స్టేషన్‌‌లోనే కాల్చి చంపేసిండు..
  • ఉత్తరప్రదేశ్‌‌లోని హర్దోయ్‌‌లో దారుణం

లక్నో: ప్రియుడితో పారిపోయిందన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యను పోలీస్‌‌ స్టేషన్‌‌ ఆవరణలోనే కాల్చి చంపేశాడు. సోమవారం ఉత్తరప్రదేశ్‌‌లోని హర్దోయ్‌‌ జిల్లా పాలిలో ఈ దారుణం జరిగింది. తన భార్య సోని(35) ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయిందని ఆమె భర్త ఆరోపి అనూప్‌‌(36) ఐదు రోజుల కింద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లోని బంగారు నగలు, రూ.35 వేల క్యాష్‌‌ పట్టుకెళ్లిందని ఆరోపించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో ప్రొడ్యూస్‌‌ చేస్తామని, స్టేషన్‌‌కు రావాలని అనూప్‌‌కు సమాచారం ఇచ్చారు. 

సోమవారం ఉదయం సోనిని కోర్టుకు తరలించేందుకు సిద్ధమవుతుండగా అక్కడే వేచి చూస్తున్న అనూప్‌‌ ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి పిస్టల్‌‌తో కాల్పులు జరిపాడు. దీంతో స్పాట్‌‌లోనే సోని ప్రాణాలు కోల్పోగా.. పారిపోయేందుకు ప్రయత్నించిన అనూప్‌‌ను పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నారు. పోలీసుల నిర్లక్ష్యం, స్టేషన్‌‌ ఆవరణలో భద్రతా లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందని పేర్కొంటూ మిస్సింగ్‌‌ కేసు దర్యాప్తు అధికారిని, కానిస్టేబుల్‌‌ను జిల్లా ఎస్పీ సస్పెండ్‌‌ చేశారు. విచారణ జరిపి బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.