
పిల్లలను బంధించిన సైకో
యూపీలో మర్డర్ కేసు దోషి దారుణం
గ్రామస్తులు, పోలీసులపైకి కాల్పులు
న్యూఢిల్లీ: యూపీలో మర్డర్ కేసులో బెయిలుపై విడుదలైన ఓ నేరస్తుడు 20 మంది పిల్లలను, మహిళలను బందీలుగా పట్టుకున్నడు. కూతురు బర్త్‌డే అని చెప్పి ఇంటికి పిలిచిన అతడు.. వాళ్లు లోపలికి రాగానే తుపాకీతో బెదిరించి లాక్ చేశాడు. గ్రామస్తులు, పోలీసులపైకి కాల్పులు జరపడంతో పాటు గ్రనేడ్ విసిరాడు. ఆ ఇంటిని చుట్టు ముట్టిన పోలీసులు పిల్లలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. గురువారం యూపీలోని ఫరూఖాబాద్ జిల్లా, కఠారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. పిల్లలను బంధించిన సుభాష్ బాథమ్‌కు ఓ హత్యకేసులో జీవిత ఖైదు పడింది. ఇటీవలే బెయిలుపై వచ్చిన అతడు గురువారం సాయంత్రం తన ఇంట్లో భార్య, కూతురితో సహా ఇతర పిల్లలను బంధించాడు. వాళ్లను కాపాడేందుకు వెళ్లిన గ్రామస్తులపైకి కాల్పులు జరపగా ఓ వ్యక్తి కాలిలోకి తూటా దూసుకుపోయింది. తర్వాత కిటికీలోంచి పోలీసులపైకి హ్యండ్ గ్రనేడ్‌ను విసరగా ముగ్గురు గాయపడ్డారు. ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులతో సమీక్షించారు. పిల్లలను కాపాడేందుకు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ టీం రంగంలోకి దిగింది.