- అధికారులకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ను అక్టోబర్ 31లోపు పూర్తి చేయాలని అధికారులను ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. మంగళవారం పనుల పురోగతిపై సెక్రటేరియెట్‌లో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పనుల్లో నిర్లక్ష్యాన్ని, ఆలస్యాన్ని సహించేది లేదన్నారు.
ఉప్పల్ ప్రాంతంలో ఏండ్ల తరబడి పనులు జరుగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 2026 దసరా నాటికి ఈ రోడ్డును పూర్తి చేస్తామని ప్రజలకు మాటిచ్చామని, ఈ మాట ప్రకారం పూర్తి చేసి తీరాల్సిందేనని అన్నారు. మ్యాన్ పవర్ పెంచి మూడు షిఫ్టుల్లో పనులు చేయాలని, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనులు జరగాలని మంత్రి ఆదేశించారు. కారిడార్ కింద 6.25 కి.మీ. బీటీ రోడ్డు పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. పది రోజులకోసారి స్వయంగా క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తామని, అందుకు తగ్గట్టు రోజువారీ వర్క్ ప్రోగ్రెస్ ను అధికారులు సమీక్షించాలని మంత్రి ఆదేశించారు.
