
- ఫోర్త్ సిటీలోనూ ఉప్పల్ తరహా స్టేడియం నిర్మిస్తం
- టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడి
ఉప్పల్/ట్యాంక్ బండ్, వెలుగు: వచ్చే ఒలింపిక్స్ నాటికి తెలంగాణను క్రీడా హబ్గా మారుస్తామని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన రాజీవ్ గాంధీ డిసబిలిటీ టీ20 చాంపియన్ షిప్ 2025 టోర్నీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఫోర్త్ సిటీలో కూడా ఉప్పల్ తరహా అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి క్రీడలపై అపారమైన మక్కువ కలిగిన నాయకుడని, ఆయన నాయకత్వంలో ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు. తాను క్రికెట్ అభిమానినని, గతంలో నిజామాబాద్ క్రికెట్ బ్లూ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించానని గుర్తుచేశారు. పిల్లలు క్రీడలపై దృష్టి సారించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.
తెలంగాణ ఉక్కు మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ
తెలంగాణ ఉక్కు మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ అని మహేశ్ కుమార్ గౌడ్ కొనియాడారు. ఆదివారం కొండా 13వ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కొండా విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ అనుసరించిన మార్గం ప్రతిఒక్కరికీ మార్గదర్శకమన్నారు. నిజాం, తెలంగాణ ఉద్యమ తొలిదశ, మలిదశ మూడు తరాలను ముద్దాడిన బాపూజీ లాంటి నాయకులు అరుదన్నారు. తెలంగాణ కోసం మంత్రిపదవిని సైతం త్యాగం చేశారని కొనియాడారు.