ఉద్యమాల శ్వాస ఉప్పుమావులూరి సాంబశివరావు

ఉద్యమాల శ్వాస ఉప్పుమావులూరి సాంబశివరావు

.కవి, రచయిత, గాయకుడు, సామాజిక ఉద్యమనేత ఉ.సా. (ఉప్పుమావులూరి సాంబశివరావు)

ఐదు దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలకు అంకితమైన మహనీయుడు. ఆయన అమరుడయి ఆరేళ్ల కాలమైంది. ఆయన జీవితం, పోరాటం, త్యాగం బహుజనులకు ఎంతో స్ఫూర్తి. విప్లవోద్యమ మేధావిగా, తత్త్వవేత్తగా, నాయకునిగా, దళిత బహుజన ‘ఉద్యమాల ఉపాధ్యాయుడు’గా ప్రజలు పిలుచుకున్నారు.

పీడిత ప్రజల అభ్యున్నతి కోసం, అస్తిత్వ పోరాటాలకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయులలో ఉ.సా. కూడా ఒకరు. విద్యార్థి దశ నుంచే హేతువాదం, విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. 1990లలోనే  ‘ఎదురీత, నలుపు’ రాజకీయ మాసపత్రికలకు సంపాదకులుగా నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.

ఈ నేల మీద జరిగిన ప్రతి సంఘటనలను రచయితగా ఖండిస్తూ పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు, కరపత్రాలు బుక్ లెట్లు, విశ్లేషకుడిగా వ్యాఖ్యానిస్తూ ఉద్యమ కలానికి గళాన్ని జోడించి  నిప్పురవ్వలు కురిపించాడు. రైతుల ఇళ్ల దర్వాజాలు ఊడబీకి,  భార్య మెడలో పుస్తెలు తీసుకెళ్ళే  ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా నాయకుడై  వెన్నుదన్నుగా  నిలబడ్డాడు. కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట, వేంపేట నరమేధ దమనకాండలపై దళిత రణ నినాదాన్ని ప్రకటించిన ధీరుడు.

విప్లవ ఆలోచనలు ప్రజాస్వామిక ప్రస్థానాలు సామాజిక న్యాయ సిద్ధాంతాలు కుల నిర్మూలన పోరాటాలు ఒకటేమిటి నేల నేలంతా ఉద్యమాల పురిటిగడ్డలో ఉపాధ్యాయుడై బోధించాడు.  గులాంగిరి లేని స్వతంత్ర ప్రత్యామ్నాయ బీసీ ఉద్యమాన్ని నిర్మించుకుందాం అంటూ సమగ్ర కులాల బీసీ సమాఖ్యను ఏర్పాటు చేసి  స్టేట్ కో ఆర్డినేటర్‌‌‌‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, బీసీ  డిక్లరేషన్  రూపొందించారు.

తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా..
పుట్టింది ఆంధ్ర అయినా ప్రత్యేక తెలంగాణకు సామాజిక  తెలంగాణకు,  సామాజిక ప్రజాస్వామ్యానికి నిబద్ధుడై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అనేక సభలలో వక్తగా, వ్యాసాలు రాస్తూ చైతన్యం నింపేవాడు. చిన్న రాష్ట్రాలు చిన్న కులాలకు తోడ్పాటంటూ సామాజిక సమన్యాయం సాధించే సామాజిక తెలంగాణ కావాలని ‘సామాజిక తెలంగాణ మహాసభ’ ద్వారా తెలంగాణ కోసం ఉద్యమించారు. 

2009 డిసెంబర్ 9 అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించిన  వెంటనే  వ్యతిరేకించిన సీమాంధ్ర అగ్రకుల పాలకవర్గ శక్తులపై తీవ్రంగా మండిపడుతూ కరపత్రాలు రాశారు. విద్వేషాలు రెచ్చగొడుతున్న సీమాంధ్ర ధన శక్తులపై  ‘జై ఆంధ్ర లేదురా- సామాజికాంధ్ర మాదిరా’ అని గర్జిస్తూ  గుంటూరు,  నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నంలో  గొప్ప సభలు  నిర్వహించి తెలంగాణ మద్దతుకు పేద ప్రజలను కూడగట్టారు.

లాల్, నీల్​జెండా కోసం..
1985 జులై 17న కారంచేడు మాదిగ సామాజిక వర్గం పైన జరిగిన దమనకాండను నిరసిస్తూ "కారంచేడు మాదిగలపై కమ్మ భూస్వాముల దాడి" అంటూ రాసిన కరపత్రం  ఆయన పనిచేస్తున్న విప్లవ పార్టీ నుంచి తొలగింపచేసేటట్టు చేసింది. మంగలి సామాజిక వర్గానికి చెందిన ఉ.సా. బీసీ ఉద్యమంలో ఎంబీసీల హక్కులకు అందరికన్నా ముందు గొంతెత్తారు. 

ఉ.సా. గొప్ప హేతువాది మానవతావాది, రాజకీయ రంగంలో లౌకికవాది. అంతేగాక మైనార్టీ మతాల హక్కుల పరిరక్షణలో అనేక సందర్భాల్లో ముందు నిలబడ్డారు. ముఖ్యంగా బాబ్రీ మసీదు కూల్చివేతను తీవ్రంగా నిరసించి వ్యతిరేకించారు. బహుజన రాజ్యం కోసం1998లో మహాజన ఫ్రంట్ ఏర్పాటు చేశాడు.

కమ్యూనిస్టులు బహుజనుల ఐక్యత కోసం లాల్ నీల్ జెండాను ముందుకు తీసుకెళ్లడంలో జీవితాంతం కృషి చేశాడు. సత్యశోధక స్ఫూర్తితో సమాజ మార్పుకు సమతా దారికి నిచ్చెనలేసిన మార్గదర్శి.  కరోనా మహమ్మా‌‌‌‌రితో 2020 జులై 25న బహుజన కలం గళం మూగబోయింది. ఉ.సా. మరణం శ్రామిక వర్గాలకు, అణగారిణ ప్రజలకు, దళిత బహుజన ఉద్యమాలకు తీరని లోటు. నిత్య అధ్యయనం ఆచరణ, సామాజిక ఆశయాల సాధనకు విప్లవించారు. భవిష్యత్తరాలకు మార్గదర్శకంగా నిలిచారు. ఆ మహనీయుడు అందించిన స్ఫూర్తితో సామాజిక మార్పుకు పనిచేయడమే మనమిచ్చే నిజమైన ఘన నివాళి.

వనపట్ల సుబ్బయ్య

* ఓపెన్ ​పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.

* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.