- దాదాపు 50 శాతం పడిపోయిన ఉత్పత్తి..
- చైనా రిస్ట్రిక్షన్లతో తగ్గిన దిగుమతులు
న్యూ ఢిల్లీ: భారత వ్యవసాయ రంగంపై ఇరాన్–అమెరికా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. యూరియా ఉత్పత్తి సగానికి పైగా పడిపోవడంతో రైతులు ఇబ్బంది పడనున్నారు. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసేయడంతో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) సప్లయ్ ఆగిపోయింది. దీంతో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు గెయిల్ (ఇండియా) లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) వంటి సంస్థలు యూరియా తయారీ ప్లాంట్లకు సప్లయ్‌లను తగ్గించాయి.
సాధా రణ స్థాయిలో 60–-65 శాతమే జరుగుతోందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొన్ని ప్లాంట్లకు 50శాతం కంటే తక్కువ అందుతోందని అన్నారు. ఫలితంగా యూరియా ఉత్పత్తి సగానికి పైగా తగ్గింది. కంపెనీలు తక్కువ సామర్ధ్యంతో ప్లాంట్లను నడుపుతున్నా, ఎనర్జీ ఖర్చు భారీగా ఉంటోంది. ప్లాంట్లలో ఉండే పెద్ద అమ్మోనియా యూరియా ప్రొడక్షన్ లైన్లు (ట్రైన్లు) తక్కువ లోడ్‌లో నడిస్తే ఎనర్జీ వాడకం ఎక్కువగా ఉంటోంది.
కంపెనీల ప్రొడక్షన్‌ను తగ్గించిన తర్వాత వీటి ఎనర్జీ వినియోగం 40శాతం వరకు పెరిగిందని అంచనా. ప్లాంట్లు ఇలాంటి పరిస్థితుల్లో ప్రొడక్షన్‌ను ఈజీగా పెంచడం లేదా తగ్గించడం వంటివి చేయలేవని సంబంధిత వ్యక్తులు తెలిపారు. దీనికి తోడు సాంకేతిక సమస్యలు, సేఫ్టీ రిస్క్‌లు లేకపోలేదని అన్నారు.
ఇండియాలో అతిపెద్ద యూరియా తయారీ సంస్థలు..
- ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఐఎఫ్‌ఎఫ్‌సీఎల్) – ప్రపంచంలోనే అతిపెద్ద సహకార ఎరువుల తయారీ సంస్థ.
- నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) – ప్రభుత్వ రంగ సంస్థ. ఉత్తర భారతదేశంలో పెద్ద యూరియా ప్లాంట్లను నిర్వహిస్తోంది.
- రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్) – ముంబై కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ. యూరియా, ఇతర నైట్రోజన్ ఆధారిత ఎరువులను తయారు చేస్తోంది.
- చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ – ప్రైవేట్ రంగంలో అతిపెద్ద యూరియా తయారీదారు. రాజస్థాన్‌లో పెద్ద ప్లాంట్లు నిర్వహిస్తోంది.
- మంగళూరు కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎంసీఎఫ్) – అడ్వెంటెజ్ గ్రూప్‌కు చెందిన ప్రైవేట్ రంగ సంస్థ. దక్షిణ భారతదేశంలో ప్రధాన యూరియా తయారీ సంస్థ.
- క్రిషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ (కేఆర్‌ఐబీహెచ్‌సీఓ)– ఐఎఫ్‌ఎఫ్‌సీఓ తర్వాత పెద్ద సహకార సంస్థ. యూరియా ఉత్పత్తిలో కీలక పాత్ర.
- గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (జీఎస్‌ఎఫ్‌సీ) – రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ. గుజరాత్‌లో యూరియా, ఇతర ఎరువులు తయారు చేస్తోంది.
ఉత్పత్తి తగ్గితే కష్టమే
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద యూరియా వినియోగదారుల్లో ఒకటి. ఉత్పత్తి తగ్గుదల కొనసాగితే రాబోయే ఖరీఫ్ సీజన్‌లో యూరియా కొరత ఏర్పడే అవకాశం ఉంది. అయితే, ఈ నెల 19 నాటికి దేశంలో 62 లక్షల టన్నుల యూరియా స్టాక్ ఉంది. ఇది గత సంవత్సరం ఇదే సమయం లో ఉన్న 55.22 లక్షల టన్నుల కంటే ఎక్కువ.
డిమాండ్, దిగుమతులు..
ఇండియాలో మొత్తం డిమాండ్: దాదాపు 340 లక్షల టన్నులు. ప్రపంచ వినియోగంలో 22 శాతానికి సమానం. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం: 280 లక్షల టన్నులు. ఏడాది మొత్తంలో 360లక్షల టన్నుల యూరియా అవసరం. ఖరీఫ్ సీజన్లోనే సుమారు 170–180 లక్షల టన్నుల వరకు అవసరం ఉంటోంది.
దిగుమతులు: 60–80 లక్షల టన్నులు. ప్రధానం గా మిడిల్ ఈస్ట్, రష్యా, చైనా నుంచి వస్తోంది. ఖరీఫ్ సీజన్ ముందు అదనపు దిగుమతులు అవసరం అవుతాయి. చైనా యూరియా ఎగుమతులపై రిస్ట్రిక్షన్లు పెట్టడంతో దిగుమతులు తగ్గాయి. 13.5 లక్షల టన్నుల దిగుమతుల కోసం ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చిలోనే ఇండియా ఆర్డర్ పెట్టింది.
