
ఒక విషాద సంఘటనలో, నవంబర్ 23న (స్థానిక కాలమానం ప్రకారం) నయాగరా జలపాతం సమీపంలో యూఎస్-కెనడా సరిహద్దు క్రాసింగ్ వద్ద వాహనంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అమెరికా వైపు నుంచి అమెరికా-కెనడా వంతెన వైపు వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొని బ్లాస్ట్ జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పలు నివేదికల ప్రకారం, మరణించిన ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు. అయితే, వారికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.
ఈ సంఘటన తర్వాత, ఆ ప్రాంతంలోని నాలుగు US-కెనడా సరిహద్దు క్రాసింగ్‌లు మూసివేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉగ్రదాడి జరిగినట్లు ఎలాంటి సూచనలు లేవని, అయితే ప్రమాదానికి కారణమేమిటో తెలియరాలేదని చెప్పారు. రెయిన్‌బో బ్రిడ్జ్ వద్ద జరిగిన ఈ సంఘటన గురించి అస్పష్టంగానే ఉందని, అమెరికా థాంక్స్ గివింగ్ సెలవుదినానికి వెళ్లడంతో సరిహద్దుకు ఇరువైపులా ఆందోళనలు చెలరేగాయని వారు చెప్పారు.
సంఘటన జరిగిన కొద్దిసేపటికే, కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్‌లకు సమాచారం అందించారు. ఈ విషయంపై అదనపు సమాచారాన్ని రాబట్టడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.