
న్యూ ఇయర్ సందర్భంగా…లేదంటే కంపెనీ ప్రారంభించిన రోజు కానీ…ఏదైనా ఫెస్టివల్ సమయంలో కొన్ని కంపెనీలు ఆయా సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు స్వీట్ బాక్స్ లు లేదంటే బోనస్ గా డబ్బులు ఇస్తుంటారు. ఇందులో భాగంగా క్రిస్ మస్ ఫెస్టివల్ కు ఓ కంపెనీ ఇచ్చిన బోనస్ ను చూసిన ఆ ఉద్యోగులు ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు.
అమెరికా మేరిల్యాండ్ లోని సెయింట్ జాన్ ప్రాపర్టీస్ సంస్థ చైర్మన్ ఎడ్వర్డ్ సెయింట్ జాన్ తన ఉద్యోగులకు క్రిస్ మస్ ఫెస్టివల్ బోనస్ ఇవ్వాలని అనుకున్నారు. ఇందులో భాగంగా సంస్థలో పనిచేసే 200 మందికి డిన్నర్ ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన వారికి ఒక్కొక్కరికి రెడ్ కవర్ అందించారు. మీ అందరికి ఇదే క్రిస్‌మస్ గిఫ్ట్ అంటూ చెప్పారు. ఆ వెంటనే ఉద్యోగులు కవర్ తెరిచి చూసి ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. ఆ కవర్ లో ప్రతి ఉద్యోగికి ఏకంగా 10 మిలియన్ డాలర్లు ( రూ. 35 లక్షలు ) బోనస్‌గా ఇచ్చారు. అది చూసిన వారంతా కన్నీరు ఆపుకోలేకపోయారు. వారి బాస్‌కు తమపై ఉన్న ప్రేమ, నమ్మకంపై భావోద్వేగానికి గురయ్యారు.
ఈ ఏడాది సంస్థ అనుకున్న లక్ష్యాలను అధిగమించినందుకే ఉద్యోగులకు బోనస్ ఇచ్చినట్లు తెలిపారు ఎడ్వర్డ్. తన ఆనందంలో ఉద్యోగులను కూడా భాగస్వామ్యులుగా చేయాలని ఈ గిఫ్ట్ ఇచ్చినట్టు ప్రకటించారు. ఈ డబ్బుతో సంస్థ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. బోనస్ అందుకున్న ఉద్యోగులు కూడ తమ బాస్‌ను ప్రశంసలతో ముంచ్చెత్తారు.